నెల్లూరులో బరితెగించిన గంజాయి బ్యాచ్..నడిరోడ్డుపై దారుణ హత్య
posted on Nov 29, 2025 5:22AM
.webp)
నెల్లూరులో గంజాయి బ్యాచ్ బరితెగించింది. గంజాయి, మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరుస్తున్న పెంచలయ్యను దారుణంగా హత్య చేసింది. నెల్లూరు హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలో ఈ దారుణం జరిగింది. నెల్లూరులో గంజాయి వినియోగానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడనీ, తమను అడ్డుకుంటున్నాడనీ కక్షగట్టిన గంజాయి బ్యాచ్ ఎలక్ట్రీషియన్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పెంచలయ్య అనే వ్యక్తిని నడిరోడ్డుపై కత్తులతో వెంటాడి మరీ హత్య చేసింది.
తన పిల్లలతో కలిసి వస్తున్న పెంచలయ్యను గంజాయి బ్యాచ్ శుక్రవారం (నవంబర్ 29) దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించడమే కాకుండా స్థానికులను భయాందోళనలకు గురి చేసింది. ముఖానికి నల్లటి ముసుగులు వేసుకుని వచ్చిన 9మంది వ్యక్తులు ఈ హత్యకు పాల్పడ్డారని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.