బీఆర్ఎస్ రజతోత్సవ సభ..కేసీఆర్ ఏమి చెపుతారు?
posted on Apr 26, 2025 8:01PM

సర్వత్రా అదే ఉత్కంఠ!
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) రజతోత్సవ సభకు సర్వం సిద్దమైంది. ఆదివారం (ఏప్రిల్ 27) జరిగే రజతోత్సవ సభ వరంగల్ జిల్లా ఎల్కతుర్తి సభా ప్రాంగణం సర్వాంగ సుదరంగా వెలిగి పోతోంది. సభా ప్రాంగణమే కాదు పరిసరాలు మొత్తం గులాబీ మయమయ్యాయి.ఇంచుమించుగా పది లక్షల మంది సభకు వస్తారన్న అంచనాలతో ఏర్పాట్లు చేశారు. బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్వయంగా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. స్థానిక నాయకులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. లక్షలాదిగా వచ్చే ప్రజలకు ఏ లోటూ లేకుండా, ఎలాంటి అసౌకర్యం కలగా ఃకుండ.. వైద్య సేవలు, అంబులెన్స్ లు సహా అని సేవలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
మరో వంక తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27న ఏర్పడిన గులాబీ పార్టీ పాతికేళ్ల పండుగను, ధూమ్ ధామ్ గా, అత్యంత వైభవంగా, నభూతో నభవిష్యత్ అన్న విధంగా నిర్వహించేందుకు గులాబీ పార్టీ గత నెల రోజులకు పైగానే కసరత్తు చేస్తోంది. ఓ వంక పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు జిల్లాల వారీగా, నియోజక వర్గాల వారీగా నాయకులతో సమావేశాలు నిర్వహిస్తునారు. సభను ఎలా సక్సెస్ చేయాలనే విషయంలో నాయకులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఒక్కసారి ఓడిపోయినా, మళ్ళీ వచ్చేది మనమే అన్న భరోసా ఇస్తున్నారు. నాయకుల్లో ఉత్సాహం నింపుతున్నారు. మరో వంక పార్టీ కార్యనిర్వక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి, హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత ఇతర ముఖ్యనాయకులు జిల్లాలలో పర్యటించి నాయకుల్లో ఉత్సాహం నింపేందుకు మండుతున్న ఎండలను సైతం లెక్క చేయకుండా గట్టిగా శ్రమిస్తున్నారు. ముఖ్యంగా జన సమీకరణ పై గులాబీ దళం ప్రత్యేక దృష్టిని కేద్రీకరించింది. ఒక విధంగా చూస్తే రజతోత్సవ సభను బలప్రదర్శన సభగా నిర్వహించే ప్రయత్నాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అయితే రాజకీయ పార్టీలు భారీ బహిరంగ సభలు నిర్వహించడం సహాజమే. అయితే.. ఎన్నికల సమయంలో లేదా ఎన్నికలు సమీపిస్తున్నసమయంలో మాత్రమే రాజకీయ పార్టీలు భారీ బహిరంగ సభలను ప్లాన్ చేస్తాయి. అయితే, బీఆర్ఎస్ ఇప్పుడు ఏ ఎన్నికలు ఉన్నాయని బల ప్రదర్శన లక్ష్యంగా సభను నిర్వహిస్తోంది అనేది ఎవరికీ అంతు చిక్కడం లేదని అంటున్నారు. సమీప భవిష్యత్ లో పంచాయతీ ఎన్నికలు, వస్తే గిస్తే, ఆ పది నియోజక వర్గాల ఉప ఎన్నికలు మినహా చెప్పుకోదగ్గ ఎన్నికలు ఏవీ కనిపించడం లేదు.అయినా, బీఆర్ఎస్ పదిలక్షల మందితో భారీ బహిరంగ సభను ఈ సమయంలో ఎందుకు నిర్వహిస్తోంది? ఈ సభ నిర్వహించేందుకు గులాబీ పార్టీ ఇంచుమించుగా రూ.100 కోట్ల వరకు ఖర్చు చేస్తోందని అంటున్నారు. అందులో ఎంత నిజం ఉందో ఏమో కానీ.. జరుగుతున్న ఏర్పాట్లు, ప్రచార హోరు చూస్తుంటే, ఇంకొంచెం ఎక్కువే ఖర్చయినా ఆశ్చర్య పోనవసరం లేదని కారు నేతలే అంటున్నారు. అవును.. డబ్బుకు వెనకాడకుండా పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని నేతలు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే.., ఈ సమయంలో ఎందుకింత ఆర్భాటం, ఎందుకీ బల ప్రదర్శన అనేది మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదని అంటున్నారు.
ఆఫ్కోర్స్.. ఒక పార్టీ చరిత్రలో రజతోత్సవాలకు ఉండే ప్రాధాన్యతను, ప్రాముఖ్యతని ఎవరూ కాదన లేరు. నిజానికి ఒక ప్రాంతీయ పార్టీ పాతికేళ్లు మనుగడ సాగించడమే గొప్ప విషయం. ముఖ్యంగా.. ఒక ఉద్యమ పార్టీగా.. తెలంగాణ రాష్ట్ర సాధన ఒక్కటే సింగల్ పాయింట్ ఎజెండాగా పుట్టిన పార్టీ పాతికేళ్ళు ప్రస్థానం సాగించడం సాధారణ విషయం కాదు. అందుకే బీఆర్ఎస్ గాపేరుమార్చుకున్న టీఆర్ఎస్ రజతోత్సవాలను ఎంత ఘనంగా జరుపుకున్నా అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. అందులోన.. ,ఈ పాతికేళ్లలో గులాబీ పార్టీ,రాష్రాన్ని సాధించి, లక్ష్యాన్ని చేరుకోవమే కాకుండా, దేశ రాష్ట్ర రాజకీయాలను ఎంతో కొంత ప్రభావితం చేసింది.
అవును.. ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యంగా 2001 నుంచి 2014 వరకు ఉద్యమ పార్టీగా (14 ఏళ్ళు) ప్రజాస్వామ్య పద్దతిలో రాజకీయ పోరాటం చేసి రాష్ట్రన్ని సాధించినగులాబీ పార్టీ, పదేళ్ళ అధికార పార్టీగా ఓ వెలుగు వెలిగిన పార్టీ రజతోత్సవాలను జరుపుకోవడం ఎంత మాత్రం తప్పు కాదు. కానీ.. కోట్లు ఖర్చు పెట్టి, ఎన్నికల సభను తలపించే విధంగా లక్షల మందితో సభను నిర్వహించడం ఎందు కోసం? దేనికి సంకేతం? అనే ప్రశ్నలకు ఆస్కారం కల్పిస్తోందని అంటున్నారు.
అదొటి అయితే.. రజతోత్సవ సభ వేదిక నుంచి పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసేఅర్ ఏమి మాట్లాడతారు? అనేది ఆసక్తిని రేకెత్తిస్తోందని అంటున్నారు. గడచిన 15- 16 నెలల్లో కేసీఆర్ ఫార్మ హౌస్ గడపదాటి బయటకు వచ్చిన సందర్భాలు పెద్దగా లేవు. ఇక బహిరంగ సభలో ప్రసంగించి కూడా చాల కాలమైంది. ఎప్పుడో సంవత్సరం సంవత్సరం క్రితం నల్గొండ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభల్లో కనిపించారు. అంతే.. ఆ తర్వాత కేసీఆర్ పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన లేదు. సో .. సహజంగానే కేసీఆర్ ఏమి మాట్లాడతారు అన్నది మాజీ మంత్రి హరీష్ రావు అన్నట్లు బీఆర్ఎస్ వారికే కాదు, కాంగ్రెస్, బీజేపీ వారికి, సామాన్య ప్రజలకు కూడా ఆసక్తి కల్గిస్తోంది.
అయితే.. విశ్వసనీయ సమాచారం మేరకు కేసీఆర్... తెలంగాణ ఉద్యమ చరిత్రతో మొదలు పెట్టి.. బీఆర్ఎస్పదేళ్ళ పాలన, ప్రస్తుత కాంగ్రెస్ పాలన గురించి ప్రసంగించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నాయకులు మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాల పైనే, కేసీఆర్ ఫోకస్ ఉంటుందని, అంటున్నారు. మరోవంక, జాతీయ రాజకీయాలకు సంబంధించి కేసీఆర్ ఏమి మాట్లాడతారు? అనేది కూడా ఆసక్తిని రేకిస్తోందని అంటున్నారు. అలాగే.. ఈ సభ తర్వాత కేసీఆర్ ఏమి చేస్తారు? బ్యాక్ టూ ఫార్మ్ హౌస్ అంటారా? ముందుండి పార్టీని నడిపిస్తారా అ నేది అన్నిటినీ మించిన వంద కోట్ల ప్రశ్న.