ఐరోపా సమాఖ్య విచ్ఛిన్నం కానుందా!

posted on: Jun 24, 2016 3:52PM

 

ఎట్టకేలకు బ్రిటన్‌ వాసులు ఐరోపా సమాఖ్య నుంచి వైదొలగేందుకు నిశ్చయించుకున్నారు. సమాఖ్యలో కొనసాగాలా వద్దా అని నిర్ణయించుకునేందుకు ఆ దేశం ఏర్పరిచిన రిఫరెండం ప్రపంచానికి దిమ్మతిరిగే తీర్పుని అందించింది. సర్వేలనీ, ఊహాగానాలనీ పక్కన పెట్టి సమాఖ్య నుంచి తప్పుకోమంటూ దేశాధినేతలను కోరింది. నిజానికి ఈ నిర్ణయం వల్ల తీవ్రంగా నష్టపోయేది బ్రిటిష్‌ ప్రజలే. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఆ దేశం ఎలాంటి అస్థిర పరిస్థితుల్లో చిక్కుకుపోయిందో... ఇప్పుడూ అవే పరిస్థితులు పునరావృతమవుతాయన్నది నిపుణుల విశ్లేషణ. వ్యాపారం దగ్గర నుంచి దౌత్యం వరకూ బ్రిటన్‌ మళ్లీ తన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నింటితోనూ కొత్తగా ఒప్పందాలు చేసుకోవలసి ఉంటుంది. అయితే బ్రిటన్‌ వాసులు ఆకాంక్ష వేరే విధంగా ఉంది. సమాఖ్యలో ఉండటం వల్ల తమ దేశం స్వతంత్రంగా ముందుకు సాగలేకపోతోందనీ... తమ అస్తిత్వానికీ, అభివృద్ధికీ సమాఖ్య సభ్యత్వం అడ్డుపడుతోందనీ వీరు భావిస్తున్నారు.

 

బ్రిటన్‌ వాసులు తీసుకున్న ఈ నిర్ణయం తాలూకు పరిణామాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. పౌండ్‌ విలువ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇక లండన్‌ స్టాక్‌ ఎక్స్‌చేంజ్ పునాదులు కదిలిపోతున్నాయి. ఈ దేశాన్ని మరో నేతకి అప్పగించండి అంటూ బ్రిటన్‌ ప్రధాని కెమరూన్‌ చేతులెత్తేశారు. కేవలం బ్రిటన్‌ ఆర్థికరంగమే కాదు... భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫేర్‌ మార్కెట్లన్నీ కుదేలైపోయాయి. ఈ నష్టం మాట అటుంచితే ఇప్పుడు మరో భయం మొదలైంది. ఇప్పటివరకూ ఐరోపా సమాఖ్యలో చేరాలని తహతహలాడే సందర్భమే కానీ బయటకు వెళ్లిపోతాననే దేశం కనిపించలేదు. కానీ ఇప్పుడు బ్రిటన్‌ వీడ్కోలుతో సమాఖ్య ముఖచిత్రం కూడా మారిపోయే అవకాశం ఉంది. ఈ పరిణామం తరువాత మిగిలన 27 దేశాలలో కూడా సమాఖ్య నుంచి వైదొలగాలనే అలజడి మొదలైతే ఐరోపా ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా కుప్పకూలిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే గత మూడు దశాబ్దాలుగా ఈ సభ్య దేశాలన్నీ కూడా వ్యాపారం మొదలుకొని వీసాల వరకూ పరస్పరం సహకారంతో ముందుకు సాగుతూ వచ్చాయి. ఆ సహకార భావం కనుక విచ్ఛిన్నమైతే పరిస్థితి ఏమిటన్నదే ఇప్పుడు కోటి పౌండ్ల ప్రశ్న!

google-ad-img
    Related Sigment News
    • Loading...