Latest News

బ్రాండెడ్ కేక్…లోపల కుళ్లిన గుడ్లు!

posted on: Mar 25, 2026 9:21PM

 

హైదరాబాద్ నగరంలో నకిలీ ఆహార పదార్థాల తయారీపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్న విషయం తెలిసిందే... అయినా కూడా కల్తీ ముఠాల ‘సృజనాత్మకత’ ఏమాత్రం తగ్గలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి నెయ్యి, నూనె, పచ్చళ్ల వరకు కల్తీకి పరాకాష్ట చూపించిన ఈ ముఠాలు… ఇప్పుడు ఏకంగా  పిల్లలు ఎంతో ఇష్టంగా తినే కేకులు, డోనట్స్ పైనా తమ ‘ప్రయోగాలు’ ప్రారంభించడంతో నగరవాసులు షాక్‌కు గురవుతున్నారు.“బ్రాండెడ్” స్టిక్కర్ కనిపిస్తే సరిపోదు... అది ఎలా తయారైందో అది కూడా తెలుసుకోండి... విశ్వసనీయ సమాచారం మేరకు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు కాటెదాన్‌లోని ఇంద్ర సొసైటీ పరిధిలో అక్రమంగా నడుస్తున్న ఓ ఆహార తయారీ కేంద్రంపై మెరుపు దాడి నిర్వహించారు. లోపలికి వెళ్లిన పోలీసులకు ఎదురైన దృశ్యం చూస్తే అది బేకరీ కంటే రసాయన ప్రయోగశాలలా కనిపించిందని అధికారులు చెబుతున్నారు.

 ఒక వైపు కుళ్లిపోయిన కోడిగుడ్ల దుర్వాసన, మరోవైపు రసాయనాల డబ్బాలు… మధ్యలో మాత్రం “ఫ్రెష్ కేక్” తయారీ జరుగుతుండ టాన్ని చూసి పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు...“మధురై మీనాక్షి ఫుడ్ కంపెనీ” పేరుతో నడుస్తున్న ఈ యూనిట్‌లో నిందితులు మార్కెట్‌లో పడేసిన పాడైపోయిన, పగిలిన కోడిగుడ్లను సేకరించి వాటికి సోడియం బెంజోయేట్, సోర్బిక్ యాసిడ్ వంటి రసాయ నాలు కలిపి అపరిశుభ్ర వాతావరణంలో కేకులు, డోనట్స్ తయారు చేస్తు న్నట్టుగా పోలీసులు గుర్తించారు. అనంతరం వాటిపై బ్రాండెడ్ కంపెనీల స్టిక్కర్లు అతికించి మార్కెట్లో విక్రయిస్తూ వినియోగదారులను మోసం చేస్తున్నారు.

ఈ వ్యవహారంలో అఫ్రిది అన్సారీ (22), యాసిన్ (32),  ఖత్రేషన్ అనే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. దాడిలో 330 కుళ్లిపోయిన కోడిగుడ్లు, సోడియం బెంజోయేట్, సోర్బిక్ యాసిడ్, పొటాషియం సోర్బేట్ వంటి రసాయ నాలు, సుమారు 150 కిలోల తయారైన కేకులు, డోనట్స్, 120 కిలోల డాల్డా, 25 కిలోల మిల్క్ పౌడర్‌తో పాటు మిక్సింగ్ మెషీన్లు, ఓవెన్లు, ఇతర యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఇటీవల నగరంలో వరుసగా బయటపడుతున్న కల్తీ ఆహార ఘటనలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా పిల్లలు ఇష్టపడే ఆహార పదార్థాల్లోనే ఇలాంటి ప్రమాదకరమైన నిజాలు బయట పడుతూ ఉండడంతో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. చౌకగా దొరికిందని వెంటనే కొనకండి…నాణ్యతను ఒకసారి పరిశీలించండి అని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...