గాంధీ భవన్‌లో గాంధీజీ?
posted on Apr 3, 2014 3:14PM

మహాత్మా గాంధీ పేరు మీద కట్టిన గాంధీ భవన్ ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఆశిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గాంధీ భవన్‌కి తండోపతండాలుగా వస్తున్నారు. వీళ్ళని కంట్రోల్ చేయడానికి గాంధీభవన్ యంత్రాంగం పబ్‌ల్లో, సినిమా ఫంక్షన్లలో కనిపించే బౌన్సర్లని వినియోగిస్తోంది. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల్లో ఎవరైనా టిక్కెట్లు కావాలని ఓవర్ యాక్షన్ చేసినా, కాంగ్రెస్ పార్టీలో సంబంధం లేని వ్యక్తులు వచ్చినా సదరు బౌన్సర్లు వాళ్ళని మెడపట్టి బయటకి గెంటేస్తారన్నమాట.
ఇలాంటి పరిస్థితుల్లో తన పేరు మీద వున్న భవన్‌ని చూసిపోవాలని గాంధీజీ వస్తే పరిస్థితి ఎలా వుంటుంది? బౌన్సర్లకి తన, మన భేదం వుండదు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఐడెంటిటీ కార్డు గాంధీజీ దగ్గర లేకపోతే బయటకి నెట్టేస్తారు. అప్పుడప్పుడు గాంధీ భవన్ దగ్గర గాంధీజీ వేషంలో కనిపించే కాంగ్రెస్ కార్యకర్తల్లో ఒకరని అనుకుని బయటకి పంపించేస్తారు. గాంధీ భవన్‌కి వచ్చే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఈయనతో మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేస్తారు కాబట్టి గాంధీజీని ఒక్క క్షణం కూడా అక్కడ వుండనివ్వరు. ఇలాంటి పరిస్థితుల్లో గాంధీజీ గాంధీ భవన్‌కి వెళ్ళకపోవడమే బెటర్.