జగన్ కి బొత్సతోడయ్యారిప్పుడు

posted on: Jun 10, 2015 6:51PM

 

ఇంతవరకు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే తెలంగాణా ప్రభుత్వం తరపున గట్టిగా వాదిస్తున్నారు. వైకాపాలో మిగిలిన నేతలు కూడా తెదేపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ వారెవరూ కూడా తెరాస, తెలంగాణా, కేసీఆర్ ప్రసక్తి రాకుండా చాలా జాగ్రత్తపడుతూ కేవలం ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశాలకు మాత్రమే పరిమితమవుతూ తెదేపాను విమర్శిస్తూ కాలక్షేపం చేసేస్తున్నారు. కానీ ఇప్పుడు బొత్స సత్యనారాయణ కూడా జగన్మోహన్ రెడ్డికి తోడయ్యారు.

 

తెలంగాణా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ ని వెనకేసుకువస్తూ, ఆయన కూడా చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. “కేసీఆర్ అంతటివాడిని పట్టుకొని చంద్రబాబు నాయుడు ‘కబడ్ధార్’ అని హెచ్చరిస్తారా...” అంటూ చంద్రబాబుపై బొత్స తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. “తప్పు చేస్తున్నారని అనుమానంకలిగితే ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ చేసినా తప్పులేదని” తెలంగాణా ముఖ్యమంత్రిని వెనకేసుకు వచ్చారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య చెలరేగిన సమస్యలను చంద్రబాబు ప్రజాసమస్యగా అభివర్ణిస్తూ రెండు రాష్ట్రాల ప్రజల మధ్య వైషమ్యాలు పెంచాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మా జగన్ బాబు చెప్పినట్లుగా తక్షణమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి నిజాయితీని నిరూపించుకొమ్మని హితవు పలికారు.

 

రాష్ట్ర విభజన సమయంలో ఆయన వ్యవహరించిన తీరు చూసి, ఆయన స్వంత జిల్లా ప్రజలే తిరగబడ్డారనే సంగతి ఆయన అప్పుడే మరిచిపోయినట్లున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకొనేందుకు ఆయనతో కలిసి తెలంగాణా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ ని వెనకేసుకువస్తూ ఇదే విధంగా మాట్లాడినట్లయితే ఈసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన పట్ల వ్యతిరేకత పెంచుకోవచ్చునని గ్రహిస్తే మంచిది. గత ఏడాది కాలంగా మీడియాకు దూరంగా ఉన్న ఆయన ఇప్పుడు వైకాపాలో ప్రవేశించిన ఆయన మళ్ళీ తన సత్తా చూపించి ప్రజలను, జగన్మోహన్ రెడ్డిని ఆకట్టుకోవాలనుకోవడం సహజమే. కానీ అందుకోసం ఈవిధంగా మాట్లాడితే మొదటికే మోసం రావచ్చును.

 

ఇదివరకు ఎన్నికల ముందు ‘కాంగ్రెస్ పార్టీతో వైకాపా కలిసి పనిచేస్తుంది’ అని నోరు జారినందుకు సబ్బం హరిని పార్టీలో చేరకముందే తలుపులు వేసేసి బయటకు గెంటేసారు. కనుక బొత్స సత్యనారాయణ కూడా పార్టీలో మిగిలిన నేతలలాగే రాష్ట్ర సమస్యలతో సరిపెట్టుకోవడం మంచిదేమో?

google-ad-img
    Related Sigment News
    • Loading...