సరిహద్దు రాజకీయాలు.. భద్రతా సవాళ్లు!

posted on: May 12, 2026 2:45PM

ఇండియా,   బంగ్లాదేశ్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న చొరబాటుదారుల అంశం ప్రస్తుతం సరికొత్త మలుపులు తిరుగుతోంది. ముఖ్యంగా బంగ్లాదేశ్‌లోని మతపరమైన సంస్థల వ్యాఖ్యలు, మారుతున్న సరిహద్దు సమీకరణాలు, అలాగే  భారత అంతర్గత భద్రతకు సంబంధించిన అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మైనారిటీల హక్కులు, జనాభా లెక్కల్లో మార్పులు, ఇంకా సరిహద్దు రక్షణ అనే మూడు ప్రధానాంశాల చుట్టూ ఈ వివాదం కేంద్రీకృతమై ఉంది.   ఇటీవల బంగ్లాదేశ్ జమాత్ - ఎ - ఇస్లామీ అధినేత డాక్టర్ షఫీకర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు పెను చర్చకు దారితీశాయి. భారత్‌లో మతం, కులం ప్రాతిపదికన ఎవరిపైనా వివక్ష చూపకూడదని, హింసకు తావుండకూడదని డాక్టర్ షఫీకుర్ రెహమాన్  అన్నారు. పశ్చిమ బెంగాల్ బాధితుల పట్ల ఆయన మానవత్వంతో కూడిన సంఘీభావాన్ని ప్రకటించారు. అయితే.. ఆయన చేసిన  ఈ వ్యాఖ్యలపై రాజకీయ విశ్లేషకులు భిన్నంగా స్పందిస్తున్నారు. బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడులు జరిగినప్పుడు మౌనంగా ఉన్న డాక్టర్ షఫీకుర్ రెహమాన్ ,  జమాత్ - ఎ - ఇస్లామీ, ఇతర సంస్థలు ఇప్పుడు భారత్ విషయంలో నైతికత గురించి మాట్లాడటం ద్వంద్వ ప్రమాణాలకు నిలువెత్తు నిదర్శనమని విమర్శకులు మండిపడుతున్నారు.   

బంగ్లాదేశ్‌లో హిందూ జనాభా క్రమంగా తగ్గుముఖం పట్టడం అనేది ఆందోళన కలిగించే వాస్తవం. 1947 విభజన సమయంలో సుమారు 20 నుంచి పాతిక శాతంగా  శాతంగా ఉన్న హిందువుల సంఖ్య ఇప్పుడు ఎనిమిది నుంచి తొమ్మిది శాతానికి పడిపోయింది.   ఆస్తుల ఆక్రమణ, సామాజిక ఒత్తిళ్లు,  టార్గెటెడ్ వయలెన్స్  కారణంగా అక్కడి మైనారిటీలు వలస బాట పట్టారని మానవ హక్కుల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇలా పారిపోయి వస్తున్న వారు భారత డెమోగ్రఫీని మారుస్తున్నారనే ఆందోళన భారత సమాజంలో బలంగా వ్యక్తం అవుతోంది.   చొరబాట్ల సమస్యను పరిష్కరించేందుకు భారత ప్రభుత్వం ఎన్ఆర్సీ, సిఏఏ   వంటి చట్టాలను తీసుకువచ్చింది. అస్సాం ఉద్యమం నుంచి నేటి వరకు ఈ అక్రమ వలసలు జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించాయని భద్రతా వర్గాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఒకవైపు మానవ హక్కుల పరిరక్షణ, మరోవైపు జాతీయ భద్రత మధ్య సమతుల్యం పాటించడం ప్రభుత్వానికి కత్తిమీద సాములా మారింది. అక్రమ వలసదారుల వల్ల ఓటు బ్యాంక్ రాజకీయాలు పెరగడం, సమస్యలు తలెత్తడం దీర్ఘకాలిక సవాళ్లుగా మారాయి.   దౌత్యపరంగా కూడా భారత్ తన స్వరాన్ని పెంచింది. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఢాకా పర్యటన సందర్భంగా అక్రమ వలసల అంశంపై కఠిన సందేశం పంపినట్లు సమాచారం. 

మీ ప్రజలను మీరు వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ భారత్ వైపు నుంచి బలంగా వినిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో కొత్త ప్రభుత్వం బిఎస్ఎఫ్ కు భూమి కేటాయింపులు,  ఫెన్సింగ్ పనులను వేగవంతం చేయడం ద్వారా చొరబాట్లకు అడ్డుకట్ట వేసే దిశగా అడుగులు వేస్తోంది.   పాకిస్థాన్‌తో బంగ్లాదేశ్‌లోని కొన్ని రాడికల్ శక్తులు సంబంధాలు పెంచుకుంటున్నాయనే వార్తలు భారత భద్రతా సంస్థలను అప్రమత్తం చేస్తున్నాయి. 1971 యుద్ధ సమయంలో పాకిస్థాన్‌కు మద్దతు ఇచ్చిన జమాత్ - ఎ - ఇస్లామీ వంటి సంస్థల చరిత్రను భారత్ మర్చిపోలేదు. రెండు వైపుల నుంచి (టూ-ఫ్రంట్ ప్రెషర్) ఒత్తిడి తీసుకువచ్చే వ్యూహాల్లో భాగంగానే ఈ రాడికల్ నెట్‌వర్క్‌లు పనిచేస్తున్నాయనే అనుమానాలు ఉన్నాయి. అందుకే వారి మానవత్వ  వ్యాఖ్యలను భారత్ ఆచితూచి పరిశీలిస్తోంది.   ప్రస్తుతానికి భారత వైఖరి స్పష్టంగా ఉంది. పొరుగు దేశాలతో సత్సంబంధాలు కోరుకుంటూనే, జాతీయ భద్రత విషయంలో రాజీ పడకూడదనేది కేంద్రం ఉద్దేశం. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నిఘా, కట్టుదిట్టమైన సరిహద్దు రక్షణ, అలాగే పౌరసత్వ చట్టాల అమలు ద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

స్నేహానికి ప్రాధాన్యత ఇస్తూనే, చొరబాట్లపై మౌనం వహించే ప్రసక్తే లేదని భారత్ తేల్చిచెప్పింది.    ఈ సమస్య కేవలం రాజకీయపరమైనది మాత్రమే కాదు, ఇది మానవత్వానికి,  దేశ భద్రతకు మధ్య ఉన్న సున్నితమైన అంశం. నిజమైన శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తూనే, చొరబాటుదారులను గుర్తించాల్సిన అవసరం ఉంది. డేటా ఆధారిత విశ్లేషణలు,  పారదర్శకమైన విధానాల ద్వారానే మైనారిటీ హక్కులను, జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడం సాధ్యమవుతుంది. భవిష్యత్తులో ఈ దిశగా భారత్ మరియు బంగ్లాదేశ్ ప్రభుత్వాలు ఏ విధంగా సహకరించుకుంటాయో వేచి చూడాలి.   

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి. 

google-ad-img
    Related Sigment News
    • Loading...