వైసీపీ ఆశలపై నీళ్లు చల్లిన బోండా ఉమ.!

posted on: Aug 7, 2026 12:07PM

విజయవాడ సెంట్రల్ శాసనసభ్యుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బోండా ఉమామహేశ్వరరావు రాజకీయ ప్రయాణంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ఊహాగానాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఇటీవల  ముద్రగడ పద్మనాభం సంతాప సభలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి వేదికను పంచుకోవడం తీవ్ర రాజకీయ చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మాజీ మంత్రి అంబటి రాంబాబుతో ఆయన  ఆత్మీయంగా మెలగడానికి సంబంధించిన  దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.  దీంతో బోండా ఉమా పార్టీ మారుతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. బోండా ఉమా తీరును సీరియస్ గా పరిగణించిన తెలుగుదేశం అధిష్ఠానం కూడా ఆయనను వివరణ కోరింది.  

అంతే కాకుండా.. తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జాతీయ ప్రధాన కార్యదర్శి కిలారు రాజేష్, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడులతో  కూడిన త్రిసభ్య కమిటీ ఎదుట హాజరై తన వైఖరిని స్పష్టం చేయాలని బోండాకు నోటీసులు పంపింది.   అయితే తనపై వస్తున్న ప్రచారాన్ని, ఆరోపణలను బోండా ఉమా తీవ్రంగా ఖండించారు. తాను వైసీపీ  కార్యక్రమంలోనూ పాల్గొనలేదని, అది ఏ రాజకీయ పార్టీకీ సంబంధం లేని   కార్యక్రమని స్పష్టం చేశారు. గుంటూరులో జనసేన మాజీ  నాయకుడు దాసరి రాము ఏర్పాటు చేసిన సంతాప సభకు మాత్రమే తాను హాజరయ్యానని తెలిపారు. ఆ వేదికపై కాకతాళీయంగా  అంబటి రాంబాబు కలవడంతో   మర్యాదపూర్వకంగా  పలకరించి మాట్లాడానని ఆయన వివరణ ఇచ్చారు.  
 
ఈ మొత్తం వ్యవహారంతో వైసీపీ విజయవాడకు చెందిన కీలక నాయకుడు తమ గూటికి చేరడం ఖాయమన్న భావనకు వచ్చింది. ఆ నేపథ్యంలోనే   వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు  అంబటి రాంబాబు, పేర్ని నాని  మీడియా ముందుకొచ్చి బోండా ఉమా మద్దతుగా గళమెత్తారు. అయితే.. తాజాగా   వైసీపీ నిరసనలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలను బోండా ఉమా గట్టిగా నిలదీయడంతో  వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి. అంతకు ముందే బోండా ఉమా పార్టీ మారే ఉద్దేశం లేదంటూ స్పష్టత నిచ్చారు.

తాజాగా విజయవాడలో  మెగా డీఎస్సీ లో అక్రమాలు అంటూ మల్లాది విష్ణు నేతృత్వంలో వైసీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్ష లో మంత్రి నారా లోకేష్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, లోకేష్ రాజీనామా చేయాలనే డిమాండ్ వినిపించారు. దీనితో బోండా తన నియోజకవర్గం లో అధికారుల అనుమతి లేకుండా వైసీపీ చేస్తున్న ఈ నిరసన దీక్షలను నిలువరించే ప్రయత్నం చేశారు. అనుమతుల్లేని  అనధికారిక దీక్షల వల్ల   స్థానిక ప్రజలు ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కుంటున్నారని, వెంటనే వైసీపీ నేతలు తమ దీక్షలు విరమించాలని బోండా   వైసీపీ కి వ్యతిరేకంగా గట్టిగా గళం విప్పారు. 

ఈ ఘటన తరువాత వైసీపీయుల స్వరం మారింది. అంతకు ముందు వరకూ బోండాకు మద్దతుగా గళమెత్తిన వైసీపీ... ఆ తరువాత.. బోండా ఉమా టార్గెట్ గా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పింింది. తాము శాంతియుతంగా  చేపట్టిన నిరాహారదీక్షను బోండా  భగ్నం చేసారంటూ   పేర్ని నాని విమర్శలు గుప్పించారు. ఒక విధంగా బోండా ఉమ   ప్రజాస్వామ్యం మీద  దాడి చేశారని దుయ్యబట్టారు. దీనితో బోండా ఉమా  విషయంలో వైసీపీ ఆశలు ఆవిరయ్యాయనీ, అందుకే ఆయన టార్గెట్ గా ఫ్యాన్ పార్టీ విమర్శలకు పదును పెట్టిందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో బోండా ఉమా ఫ్యాన్ గూటికి చేరుతున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి కూడా బోండా చెక్ పెట్టారని అంటున్నారు.  

Bonda Uma, Vijayawada Central, TDP leadership, YSRCP, Ambati Rambabu

google-ad-img
    Related Sigment News
    • Loading...