నాంపల్లి కోర్టుకు బాంబు బెదరింపు

posted on: Feb 18, 2026 12:26PM

కరీంనగర్, రాజమహేంద్రవరం జిల్లా కోర్టులకు కూడా

తెలుగు రాష్ట్రాల్లోని పలు కోర్టులకు బాంబు బెదిరింపులు రావడం పెను సంచలనం సృష్టించింది. బుధవారం (ఫిబ్రవరి 18) ఉదయం ఉభయ తెలుగు రాష్ట్రాలలోని పలు కోర్టులకు ఏకకాలంలో బాంబు బెదరింపు మెయిల్స్ రావడం కలకలం రేపింది. హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టు సహా కరీంనగర్, రాజమహేంద్రవరం జిల్లా కోర్టులకు బాంబు బెదరింపు ఈమెయిల్స్ వచ్చాయి. 

  హైదరాబాద్లోని నాంపల్లి సీబీఐ కోర్టుకు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు రావడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు కోర్టు ప్రాంగణాన్ని ఖాళీ చేయించి విస్తృత తనిఖీలు చేపట్టారు.  కోర్టులో విధుల్లో ఉన్న సిబ్బంది, న్యాయవాదులు, కేసుల విచారణ కోసం వచ్చిన ప్రజలను బయటకు పంపించి భవనాన్ని పూర్తిగా ఖాళీ చేశారు. అనంతరం బాంబ్ స్క్వాడ్‌, డాగ్ స్క్వాడ్‌, క్లూస్ టీమ్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని కోర్టు భవనంలోని ప్రతి అంతస్తు, గదులు, కారిడార్లు, పార్కింగ్ ప్రదేశాలను క్షుణ్ణంగా సోదా చేశారు.   కోర్టు పరిసరాల్లో భారీ  పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.  ట్రాఫిక్‌ను మళ్లించి ప్రాంతాన్ని పూర్తిగా పోలీసుల అధీనంలోకి తీసుకున్నారు. కోర్టులో కేసుల విచారణను తాత్కాలికంగా నిలిపివేశారు.

కాగా కరీంనగర్ జిల్లా కోర్టుకు కూడా ఇలాగే బాంబు బెదరింపు ఈ మెయిల్ రావడంతో అక్కడ కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. బాంబ్, డాగ్ స్క్వాడ్ లతో తనిఖీలు నిర్వహించారు. కోర్టు కార్యకలాపాలను నిలిపివేశారు. అదే విధంగా  ఆంధ్రప్రదేశ్ లోని  రాజమహేంద్రవరం జిల్లా జైలుకూ కూడా ఇదే విధంగా బాంబు బెదరింపు ఈ మెయిల్ వచ్చింది. అక్కడ కూడా విస్తృత తనిఖీలు నిర్వహించారు.  ఇలా ఉండగా ఈ బెదరింపు మెయిల్స్ వెనుక ఎవరున్నారన్న వివరాలు తెలుసుకునేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దింగారు.  మెయిల్ పంపిన సర్వర్, ఐపీ అడ్రస్, ఉపయోగించిన నెట్‌వర్క్ వివరాలను సేకరిస్తున్నారు. ఒకేసారి పలు కోర్టులకు బెదిరింపులు రావడంతో  దీని వెనుక ఏదైనా కుట్రకోణం ఉందా? అకతాయిల పనేనా అన్న కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది.  ఇటీవలి కాలంలో కోర్టులను లక్ష్యంగా చేసుకుని తరచూ బెదిరింపులు రావడం పట్ల  తీవ్ర ఆందోళన వ్యక్తం  అవుతోంది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...