Latest News

హైదరాబాదులో బోగస్ కంపెనీల దందా!

posted on: Mar 29, 2026 6:39AM

హైదరాబాద్లో బోగస్ కంపెనీల పేరుతో జరుగుతున్న జీఎస్టీ మోసాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా పాత ఇనుము, స్టీల్ వ్యాపారాన్ని అడ్డంగా పెట్టుకుని నకిలీ బిల్లుల ద్వారా భారీగా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేస్తున్న ముఠాల కార్యకలాపాలు ఆదాయపు పన్ను, జీఎస్టీ అధికారులను అప్రమత్తం చేశాయి. సరుకు కొనుగోలు జరగకపోయినా కొనుగోలు చేసినట్లు చూపించి ప్రభుత్వానికి చెల్లించని పన్నును తిరిగి పొందే విధంగా ఈ మోసం కొనసాగుతున్నట్టు విచారణలో బయటపడింది.
ఇనుముపై 18 శాతం జీఎస్టీ ఉండటాన్ని అవకాశంగా మార్చుకున్న మోసగాళ్లు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా ఇనుము కొనుగోలు చేసినట్లు నకిలీ ఇన్వాయిసులు సృష్టిస్తున్నారు. వాస్తవానికి సరుకు లావాదేవీలు లేకపోయినా కాగితాలపై పెద్ద ఎత్తున వ్యాపారం జరిగినట్టు చూపుతూ కోట్ల రూపాయల ఐటీసీ క్లెయిమ్ చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ విభాగాల వద్ద వేల సంఖ్యలో నమోదైన అనుమానాస్పద కంపెనీలపై అధికారులు దృష్టి కేంద్రీకరించారు.
ఈ నేపథ్యంలో రాణిగంజ్ కేంద్రంగా నడుస్తున్న ఎస్‌కేజీ ట్రేడింగ్ కంపెనీ దందా బయటపడింది. అధికారులు నిర్వహించిన తనిఖీలలో ఈ సంస్థ రూ.84.15 కోట్ల జీఎస్టీ ఎగవేతకు పాల్పడినట్లు గుర్తించారు. ఇనుముకు సంబంధించిన కొన్ని వస్తువులు అమ్ముతున్నట్లు చూపిస్తూ రూ.84 కోట్లకు పైగా ఐటీసీ క్లెయిమ్ చేసినట్టు తేలింది. పత్రాల్లో భారీ లావాదేవీలు నమోదై ఉండగా, స్థలంలో చిన్న షట్టర్ దుకాణం మాత్రమే ఉండటం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది.

విచారణలో భాగంగా షాప్ యజమాని సందీప్ కుమార్ గోయల్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అతను మరో రెండు షెల్ కంపెనీలను కూడా నిర్వహిస్తున్నట్టు   బయటపడింది. నగరంలో ఇలాంటి బోగస్ కంపెనీలు మరిన్న ఉన్నట్లు అనుమానిస్తున్న అధికారులు  దర్యాప్తు వేగవంతం చేశారు.జీఎస్టీ వ్యవస్థలో ఉన్న లోపాలను ఉపయోగించుకుని జరుగుతున్న ఈ తరహా మోసాలను అరికట్టేందుకు ఐటీ మరియు జీఎస్టీ విభాగాలు సంయుక్త చర్యలు ప్రారంభించాయి. త్వరలో మరిన్ని బోగస్ కంపెనీలు వెలుగులోకి వచ్చే అవకాశముందని అధికారులు అంటున్నారు..

google-ad-img
    Related Sigment News
    • Loading...