జూబ్లీహిల్స్.. బీజేపీ లెక్క తేలలేదా?..తప్పిందా?
posted on Oct 13, 2025 6:33AM

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సోమవారం (అక్టోబర్ 13) నోటిఫికేషన్ విడుదల అవుతుంది. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఇప్పటికే అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ లు తమతమ అభ్యర్థులను ప్రకటించేశాయి. అయితే కమలం పార్టీ మాత్రం అభ్యర్థి విషయంలో ఇప్పటి వరకూ ఓ నిర్ణయానికి రాలేదు. ముగ్గురు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి వారిలో ఒకరిని అభ్యర్థిగా ప్రకటించడానికి అధిష్ఠానం అనుమతి కోసం ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు హస్తినకు వెళ్లారు. అయితే తెలంగాణలో బీజేపీ పరిస్థితి చాలా కాలంగా ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా ఉంది. రాష్ట్ర పార్టీలో నేతల మధ్య విభేదాలే ఇందుకు కారణం అని పరిశీలకులు అంటున్నారు. జూబ్లీ బైపోల్ విషయంలో కూడా అభ్యర్థి ఎంపిక విషయం ఇంత వరకూ తేలకపోవడానికి కూడా అదే కారణమని చెబుతున్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానం జూబ్లీ బైపోల్ అభ్యర్థి విషయంలో ఇప్పటి వరకూ దృష్టి పెట్టలేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నా.. అదే బీహార్ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ జూబ్లీ ఉప ఎన్నిక విషయాన్ని ఇసుమంతైనా నిర్లక్ష్యం చేయలేదు. కానీ బీజేపీ మాత్రం నామినేషన్ల పర్వానికి చివరి నిముషాలు సమీపిస్తున్నా కూడా అభ్యర్థి విషయంలో ఎటూ తేల్చకుండా నానుస్తుండటంతో తెలంగాణలో బీజేపీ లెక్కతేలలేదా; లేక తప్పిందా అన్న చర్చ రాజకీయవర్గాలలో ఆరంభమైంది.
గత అసెంబ్లీ ఎన్నికల నుంచీ కూడా తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ ఆ లక్ష్య సాధన విషయంలో మాత్రం విఫలమౌతూనే వస్తోంది. జూబ్లీ ఉప ఎన్నిక అభ్యర్థిని తేల్చే విషయంలో ఇంతగా మల్లగుల్లాలు పడుతుండటంతో ఆ పార్టీ ప్రచారంలో కూడా ఇప్పటికే వెనుకబడింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ జూబ్లీ బైపోల్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ఏ మేరకు పోటీ ఇవ్వగలదన్న అనుమానాలు కమలం శ్రేణుల్లోనే వ్యక్తం అవుతున్నాయి.