ఏపీ మద్యం కుంభకోణంపై కేంద్రం విచారణ.. లోక్ సభలో ఎంపీ సీఎం రమేష్!
posted on Feb 12, 2025 9:50AM

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంపై ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ మద్యం కుంభకోణం కంటే ఏపీలో జరిగిన మద్యం కుంభకోణం పది రెట్లు పెద్దదని బీజేపీ సీనియర్ నాయకుడు, అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ లోక్ సభ సాక్షిగా చెప్పారు. ఆంధ్రప్రదేద్ లో మద్యం కుంభకోణం అంశాన్ని ఆయన మంగళవారం (ఫిబ్రవరి 11) లోక్‌సభలో జీరో అవర్‌లో లేవనెత్తారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో నగదు లావాదే వీలతోనే సాగిన మద్యం అమ్మకాలలో లక్ష కోట్ల రూపాయల స్కాం జరిగిందని సీఎం రమేష్ ఆరోపించారు. అసలు మద్యం విక్రయాలన్నీ నగదుతోనే జరిగాయనీ, ఏదీ డిజిటల్ ఫార్మాట్‌లో లేదని సీఎం రమేష్ లోక్ సభలో చెప్పారు. జగన్ అధికారపగ్గాలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో మద్యం విధానాన్ని మార్చారనీ, అప్పటి వరకూ ప్రైవేటు షాపుల ద్వారా జరిగే మద్యం విక్రయాలను జగన్ తన హయాంలో ప్రభుత్వ దుకాణాలకు మార్చేశారనీ వివరించారు. అయితే పని చేసే ఉద్యోగులు మాత్రం కాంట్రాక్టు కార్మికులని చెప్పిన ఆయన ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మద్యం కుంభకోణంతో పోలిస్తే ఢిల్లీ మద్యం కుంభకోణం చాలా చిన్నదన్నారు.
ఈ కుంభకోణంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే శ్వేత పత్రం విడుదల చేసింది. ఈ కుంభకోణంలో సూత్రధారులు, పాత్రధారులను ఎవరినీ వదిలేది లేదని స్పష్టం చేసింది. అవసరమైతే సీబీఐ, ఈడీలకు ఈ కేసు అప్పగిస్తామనీ చెప్పింది. ఇప్పుడు తాజాగా సీఎం రమేష్ ఆంధ్ర ప్రదేశ్ మద్యం కుంభకోణంపై కేంద్రం పూర్తి స్థాయి విచారణ జరపాలని లోక్ సభ వేదికగా డిమాండ్ చేశారు. దీంతో ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ కే పరిమితమైన ఈ అంశం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభకోణంపై దర్యాప్తునకు సిట్ వేసిన సంగతి తెలిసిందే. క్రితం విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు నేతృత్వంలో సిట్ ఏర్పాటైన సిట్ లోఎక్సైజ్ శాఖ అధికారులను కూడా ఏపీ సర్కార్ చేర్చింది. ఇప్పుడు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ బాబు ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంపై కేంద్రం పూర్తిస్థాయిలో విచారణ జరపాలని లోక్ సభ సాక్షిగా డిమాండ్ చేయడంతో జాతీయ స్థాయిలో ఏపీ మద్యం కుంభకోణం హైలైట్ అయ్యింది.