అన్న ఎన్టీఆర్‌ బాటలోనే బీజేపీ!

సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు ఇది తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మనసా వాచా కర్మణా నమ్మి ఆచరించిన సిద్ధాంతం.  రెండు రూపాయలకే కిలోబియ్యం.. పేదలకు జనతా వస్త్రాలు.. పేదలకు పక్కా ఇళ్లు.. వృద్ధులకు పెన్షన్ ..ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలలో ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. రాజకీయ చైతన్యాన్ని జనక్షేత్రానికి తీసుకువెళ్లిన ఘనత ఆయనదే.  దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఎన్టీఆర్ చూపిన సంక్షేమ మార్గాన్నే అనుసరిస్తోంది. ఇది సత్యం. ఆయన ప్రవేశ పెట్టిన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం ఇప్పుడు దేశ వ్యాప్తంగా అమలు అవుతోంది. పేరు మారి ఉండొచ్చు. రూపాయికే కిలో బియ్యం ఇస్తుండొచ్చు కానీ ఆ పథకానికి ఆద్యుడు మాత్రం ఎన్టీఆరే. తాజాగా బీజేపీ కూడా ఎన్టీఆర్ బాటలోనే ఢిల్లీ ఎన్నికల కోసం తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆ మేనిఫెస్టోలో వృద్ధులకు పెన్షన్లు ప్రకటించింది. ఇక తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీఆర్ పేరిట అన్న క్యాంటిన్లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బీజేపీ కూడా ఢిల్లీ ఎన్నికల మేనిఫెస్టోలో అన్న క్యాంటిన్ల మాదిరిగా అటల్ క్యాంటిన్లు ప్రారంభించనున్నట్లు పేర్కొంది. ఆ క్యాంటిన్ల ద్వారా ఢిల్లీలో  పేదలకు ఐదు రూపాయలకే నాణ్యమైన, రుచికరమైన భోజనం అందిస్తామని పేర్కొంది.

పేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన ఎన్టీఆర్ దేశ రాజకీయాలలో ఆదర్శప్రాయుడిగా నిలిచారనడానికి ఇంత కంటే నిదర్శనం ఏం కావాలి. . ఇప్పుడు దేశ వ్యాప్తంగా అమలు అవుతున్న సంక్షేమ పథకాలన్నీ దాదాపు ఎన్టీఆర్ మస్తిష్కం నుంచి పుట్టినవేననడంలో సందేహం లేదు. కిలో రెండు రూపాయలకే బియ్యం పథకాన్ని ఆయన ప్రారంభిస్తే.. ఇప్పుడు అదే పథకం దేశ వ్యాప్తంగా అమలు అవుతున్నది. దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎన్టీఆర్ సంక్షేమ బాటనే అనుసరిస్తోందనడంలో సందేహం లేదు. పార్టీలు సంక్షేమం పేరిట ప్రజలను సోమరులను చేస్తున్నాయనీ, దీని వల్ల దేశ ప్రగతి కుంటుపడుతోందని విమర్శలు గుప్పించిన పార్టీలు కూడా ఎన్టీఆర్ సంక్షేమ బాటనే అనుసరిస్తున్నాయంటే ఆయన సంక్షేమ పథకాలకు ప్రజలలో ఎంతటి ఆదరణ ఉందో ఇట్టే అవగతమౌతుంది. 

ఎన్నికలలో ఓట్లు దండుకోవడానికి ఇచ్చే   హామీలు దేశ భవిష్యత్ కు, ప్రగతికీ అత్యంత ప్రమాదకరమని విమర్శలు గుప్పించే బీజేపీ కూడా  ఎన్టీఆర్ సంక్షేమ పథకాలను కొనసాగించక తప్పడం లేదంటే ప్రజాక్షేత్రంలో వాటి ప్రభావం ఎంత బలంగా ఉందో అవగతమౌతోంది.   తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ తన ఎన్నికల మేనిఫొస్టోను సంక్షేమ హామీలతోనే నింపేసింది. ఈ హామీలన్నీ ఎన్టీఆర్ ఎప్పుడో అమలు చేసినవే.  . 60-70 ఏళ్ల మధ్య వృద్ధులకు నెలకు రూ. 2,500, 70 సంవత్సరాల పైబడి వారికి రూ.3 వేలు అందజేస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో పేర్కొంది. ఎన్టీఆర్ ఎప్పుడో వృద్ధులకు పెన్షన్ పథకాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే.  కొసమెరుపేంటంటే ఎన్టీఆర్ పేరు మీద చంద్రబాబు సర్కార్ అన్న క్యాంటిన్లను ప్రారంభించి పేదలకు ఐదు రూపాయలకే నాణ్యమైన, రుచికరమైన భోజనం అందిస్తోంది. ఇప్పుడు బీజేపీ కూడా అదే బాటలో తాము ఢిల్లీలో అధికారంలోకి వస్తే  మురికివాడలలో అటల్ క్యాంటిన్ల ద్వారా పేదలకు ఐదు రూపాయలకే భోజనం అందిస్తామని బీజేపీ మేనిఫెస్టో పేర్కొంది.  ఇలా దేశంలోని ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజాదరణ పొందాలంటే ఎన్టీఆర్ సంక్షేమ మార్గాన్ని అనుసరించి తీరాల్సిందే. దేశ రాజకీయాలను ఇంతగా ప్రభావితం చేసిన నేత ఎన్టీఆర్ వినా మరొకరు లేరు.