మోడీ వర్సెస్ స్టార్స్..

 

పాపం బీజేపీ పరిస్థితి తమిళనాడులో అంత బాలేదని చెప్పొచ్చు. ఎందుకంటే వరుసపెట్టి సూపర్ స్టార్స్ అందరూ తమ వ్యతిరేకతను చూపిస్తున్నారు. ఎవరైతే ముందు ఆ పార్టీకి మద్దతు పలికారో ఇప్పుడు వాళ్లే బీజేపీకి వ్యతిరేకత చూపిస్తుండటంతో బీజేపీ నాయకులు ఏం చేయాలో తెలియని అయోమయంలో పడ్డారు. ప్రధానిగా మోడీ ఎప్పుడైతే అధికారం చేపట్టారో అప్పటినుండి బీజేపీ పార్టీ రూపురేఖలే మారిపోయాయి. ఉత్తరాధిన ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా బీజేపీకి ఎదురులేకుండా పోయింది. అన్ని ఎన్నికల్లో దాదాపు విజయం సాధిస్తూ ప్రతిపక్ష పార్టీలకు నిద్రపట్టకుండా చేసింది. ఈ నేపథ్యంలో దక్షిణాధిన ప్రాంతాలపై కూడా దృష్టి సారించారు బీజేపీ పెద్దలు. కానీ తమిళనాడులో మాత్రం బీజేపీ వర్సెస్ స్టార్స్ అన్నట్టుమారింది పరిస్థితి.

 

ఇక తమిళనాడులో జయలలిత మరణానంతరం అస్తవ్యస్తంగా మారిన తమిళనాడు రాజకీయాల్లో కూడా వేలు పెట్టిన బీజేపీ.. అన్నాడీఎంకేకు తమ మద్దతు పలికి.. అధికారంలో కూర్చోబెట్టి తెర వెనుక ఉండి రాజకీయాలు నడిపిద్దామని ప్లాన్ వేసింది. కానీ అవి పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇక తాను రాజకీయ ప్రవేశం చేస్తున్నానని చెప్పిన రజనీకాంత్ పై దృష్టి పెట్టిన బీజేపీ రజనీ బీజేపీలోకి రావాలని..బీజేపీలో చేరాలంటూ రజనీకాంత్‌ను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కోరారు. అంతేకాదు పలువురు ప్రముఖులు ద్వారా రాయబారాలు కూడా పంపారు. కానీ రజనీ మాత్రం ఇంకా తన నిర్ణయాన్ని చెప్పలేదు. అయితే తాజాగా.. మెర్సల్ సినిమా వివాదంపై స్పందించిన రజనీ బీజేపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి బీజేపీకి షాక్ ఇచ్చాడు. ‘మెర్సల్’ సినిమా మంచి అంశాలను ప్రస్తావించారని ఆల్ బెస్ట్ అని చెప్పారు.

 

ఇక రజనీ తరువాత రాజకీయాల్లోకి వస్తున్నా అని చెప్పిన కమల్ కూడా ఏందుకో బీజీపీ విషయంలో తన మనసు మార్చుకున్నాడు. తమిళనాడు ప్రజల కష్టాలు తీర్చడానికి అవసరం అయితే బీజేపీతో కలిసి పని చెయ్యడానికి తాను సిద్దంగా ఉన్నానని కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత ఏమైందో ఏమో తెలియదు కానీ.. తన సిద్దంతాలకు బీజేపీ సిద్దాంతాలకు చాల వ్యత్యాసం ఉందని.. నోట్ల రద్దుకు బీజేపీకి మద్దతు తెలిపినందుకు క్షమాపణలు అడుగుతున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

ఇక ఇప్పుడు వాళ్లకి తోడుగా ప్రకాశ్ రాజ్ చేరాడు. గత కొద్దిరోజులుగా ప్రకాశ్ రాజ్ బీజేపీ తీరుపై మండిపడుతున్నారు. గౌరి లంకేశ్ హత్యకేసులో నోరు విప్పిన ఈయన.. తాజాగా తాజ్ మహల్ వివాదంపై కూడా స్పందించారు. తాజ్ మ‌హ‌ల్ చ‌రిత్ర త‌వ్వ‌కాలు మొద‌లుపెట్టార‌ని, ఇంత‌కీ తాజ్ మ‌హ‌ల్ ను ఎప్పుడు ప‌డ‌గొట్టాల‌ని అనుకుంటున్నారో చెబితే…త‌న పిల్ల‌ల‌కు చివ‌రిసారిగా తాజ్ మ‌హ‌ల్ ను చూపిస్తాన‌ని ట్వీట్ చేశారు. అంతేకాదు..  ప్రశ్నించడం అనేది నా ప్రాధమిక హక్కు..నేను ప్రస్నిస్తూనే ఉంటా..నా ప్రశ్నల వర్షం కొనసాగిస్తా అని ట్వీట్ చేశాడు.

 

రాజకీయాల్లో సినీ గ్లామర్‌ గురించి కొత్తగా చెప్పుకోడానికేముంది.? రాజకీయ పార్టీల్లో సినిమా గ్లామర్ ఎంత వరకూ ఉపయోగపడుతుందో అందరికీ తెలిసిందే. తమ అభిమాన హీరోలు ఏ పార్టీ తరపున ప్రచారాలు చేస్తారో.. అభిమానులు కూడా ఆ పార్టీకి ఓట్లు వేసి తమ అభిమానాన్ని చాటుకుంటారు. అందుకే రాజకీయ పార్టీలు కూడా సినిమారంగానికి చెందిన వారికి పార్టీల్లోకి తీసుకోవడానికి ఏ మాత్రం ఆలోచించరు. కానీ ఇప్పుడు వరుసపెట్టి తమిళనాడులో సూపర్ స్టార్స్  బీజేపీకి వ్యతిరేకంగా మారడం ఓ రకంగా పార్టీ నష్టం కలిగించేదే. మొత్తానికి బీజేపీ పప్పులు తమిళనాడులో ఉడికే ఛాన్స్ లేనట్టే కనిపిస్తోంది. మరి ముందు బీజేపీకి మద్దతు పలికిన స్టార్స్ ఇప్పుడు ఎందుకు పార్టీ నచ్చడం లేదు.. లేక బీజేపీనే అలా వ్యవహరిస్తుందా... ఇంకా ఎంత మంది స్టార్స్ కు బీజేపీ విధి విధానాలు నచ్చడం లేదు... ఇవన్నీ తెలియాలంటే మనకి కూడా రాజకీయ నాయకులకు ఉన్న బుర్ర ఉండాల్సిందే.