బీజేపీ కురువృద్ధుడు అద్వానీ అస్త్ర సన్యాసం చేస్తారా
posted on Apr 5, 2015 7:42AM
.jpg)
నరేంద్ర మోడీకి పార్టీలో కీలక బాధ్యతలు కట్టబెట్టినప్పుడే అలిగి అస్త్ర సన్యాసం చేసిన బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ ఆ తరువాత మోడీతో కొంచెం సర్దుకుపోయినప్పటికీ క్రమంగా ఆయనని పార్టీలో వెనుక బెంచీలకు పరిమితం చేసేయడంతో దాదాపు కనుమరుగయిపోయారు. మీడియాలో ఆయన గొంతు విని చాలారోజులే అయిపోయింది. మళ్ళీ చాలా రోజుల తరువాత ఆయన బెంగళూరులో జరుగుతున్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకి హాజరయ్యారు. కానీ అక్కడ కూడా ఆయనకు తగిన ప్రాధాన్యత దక్కకపోవడంతో సమావేశాలలో ప్రసంగించేందుకు ఆయన నిరాకరించారు. ఆయనను సమావేశాల ఆరంభానికి సూచికగా జ్యోతీ ప్రజ్వలన కార్యక్రామానికి ఆహ్వానించినప్పటికీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని మోడీ తదితరులు అందరూ ప్రసంగించారు కానీ ఆయనకు అవకాశం ఇవ్వలేదు. సమావేశంలో రెండవరోజు ఆయనను మాట్లాడేందుకు ఆహ్వానించినప్పుడు ఆయన నిరాకరించారు. మోడీ కానీ అమిత్ షా గానీ ఆయనను మాట్లాడమని బలవంతం చేయలేదు. కనుక ఇకపై ఇటువంటి సమావేశాలలో ఇక అద్వానీ పాల్గొనకపోవచ్చునని భావించవచ్చును.