ఒంటరి పోరాటానికే కమలం సై
posted on Mar 11, 2014 7:59AM
.jpg)
తెలుగుదేశం పార్టీ సహా అనేక పార్టీల ఆశలపై బీజేపీ నీళ్లు చల్లేసింది. రాష్ట్రంలో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయిస్తోంది. తమ రాష్ట్రశాఖ అలాగే భావిస్తోందని, జాతీయస్థాయిలో కూడా తమను సంప్రదించకుండా ఎలాంటి నిర్ణయం పొత్తుల విషయంలో తీసుకోరని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సుప్తచేతనావస్థలో ఉన్న అసెంబ్లీలో మూడు స్థానాలు మాత్రమే కలిగి ఉండి, రాష్ట్రం నుంచి ఒక్క ఎంపీ స్థానం కూడా లేకపోయినా.. తెలంగాణా రాష్ట్రం తమవల్లే వచ్చిందన్న ప్రచారంతో ఈసారి నేరుగా పోటీ చేయాలని కమలనాథులు భావిస్తున్నారు. తమ పార్టీ టికెట్లకు కూడా బోలెడంత డిమాండ్ ఉందని, ఒక్కో చోట అయితే ఐదారుగురు కూడా పోటీ పడుతున్నారని అంటున్నారట. ఇక సీపీఎం తరహాలోనే రెండు ప్రాంతాలకు రెండు శాఖలను ఏర్పాటుచేసే ప్రయత్నాలలో బీజేపీ పడింది. తెలంగాణా, ఆంధ్రా శాఖల పేర్లతో వీటిని ఏర్పాటు చేసేందుకు కసరత్తు మొదలుపెట్టారు.