ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం

posted on: Feb 9, 2026 8:28PM

 

ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం రేగుతోంది. అన్నమయ్య జిల్లా సొదుం  మండల పరిధిలో బర్డ్ ఫ్లూ అనుమానిత కేసులు నమోదవడంతో పౌల్ట్రీ రంగంలో ఆందోళన నెలకొంది. సదుం, అమ్మగారిపల్లి, కంభంవారిపల్లి, పుట్టవాండ్లపల్లి గ్రామాల్లోని పలు కోళ్ల ఫారాల్లో అసాధారణ మరణాలు చోటుచేసుకోవడంతో అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. పశుసంవర్థక శాఖ సిబ్బంది ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపించారు. 

వైరస్ వ్యాప్తి నివారణకు నియంత్రణ చర్యలు ప్రారంభించారు. ప్రభావిత ఫారాల్లో కోళ్లలో కనిపిస్తున్న లక్షణాలు బర్డ్ ఫ్లూను సూచిస్తున్నాయని అధికారులు తెలిపారు. కోళ్లలో ఆకస్మిక మరణాలు, ఆహారం తినకపోవడం, నీరసం, రెక్కలు వాలిపోవడం, గుడ్లు పెట్టడం, తగ్గిపోవడం, తల వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.  

చిత్తూరు జిల్లాలోని ఒక ఫారంలో సుమారు రూ.17 లక్షల విలువైన కోళ్లు మృతి చెందినట్లు తెలిసి రైతు తీవ్ర ఆర్థిక నష్టాన్ని చవిచూస్తున్నాడు. సమీప గ్రామాల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
బర్డ్ ఫ్లూ వైరస్ పక్షుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే అవకాశము ఉండటంతో ప్రజలు నిర్లక్ష్యం చేయరాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనుషుల్లో జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాసలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించవచ్చని తెలిపారు. 

చనిపోయిన లేదా అనారోగ్యంగా ఉన్న కోళ్లను తాకకూడదని, కోడి మాంసం మరియు గుడ్లను పూర్తిగా ఉడికించిన తర్వాత మాత్రమే తినాలని సూచిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. ప్రభుత్వం ప్రభావిత ప్రాంతాల్లో కట్టుదిట్టమైన పర్యవేక్షణతో పాటు రైతులకు తక్షణ నష్టపరిహారం అందించాలని స్థానికులు కోరుతున్నారు. గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వ్యాధి నివారణ చర్యలపై ప్రజలకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సమయానికి సరైన చర్యలు తీసుకుంటే వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని అధికారులు పేర్కొన్నారు.

*బర్డ్ ఫ్లూ పై  ఆందోళన వద్దు: కలెక్టర్.

బర్డ్ ఫ్లూ పై ప్రజలు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, బర్డ్ ఫ్లూ వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 
సదుం మండలంలోని పుత్తవారిపల్లె, అమ్మగారి పల్లె గ్రామాలలోని రెండు కోళ్ల ఫారాలలో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకిన నేపథ్యంలో కోళ్లను ఖననం చేయడానికి జిల్లా కలెక్టర్ పశుసంవర్ధక శాఖకు ఆదేశాలు జారీ చేశారు. 
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సదుం మండలంలో గుర్తించిన బర్డ్ ఫ్లూ పై చర్యలు తీసుకునేందుకు పశుసంవర్ధక శాఖకు తగిన ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. 

పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్యశాఖ తదితర శాఖల సమన్వయంతో సదుం మండలం నుండి ఇతర ప్రాంతాలకు కోళ్ల సరఫరా జరగకుండా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ప్రజలు ఎవరు బర్డ్ ఫ్లూ పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. బర్డ్ ఫ్లూ వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. సదుం మండలం మినహా మిగతా ఏ మండలాలలో అసాధారణ కోళ్ళ మరణాలు సంభవించలేదని పేర్కొన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పిస్తున్నామని పేర్కొన్నారు. 

పశు సంవర్ధక శాఖ అప్రమత్తం 

అన్నమయ్య జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి గుణశేఖర్ మాట్లాడుతూ  అన్నమయ్య జిల్లా సదుం మండలం పుత్తవారిపల్లె, అమ్మగారి పల్లె, కంభం వారి పల్లె, గ్రామాలకు చెందిన ముగ్గురు రైతుల కోళ్ల ఫారాలలో అనూహ్యమైన సంఖ్యలో కోళ్ల మరణాలు సంభవించగా అప్రమత్తమైన పశుసంవర్ధక శాఖ మొదటి రెండు కోళ్ల ఫారాల నుండి చనిపోయిన కోళ్ల శాంపుల్స్ ను మధ్యప్రదేశ్ భోపాల్ లోని హై సెక్యూరిటీ ల్యాబ్ కు పంపగా చనిపోయిన కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లుగా నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పుత్తవారిపల్లె మరియు అమ్మగారి పల్లె గ్రామాలలోని రెండు కోళ్ల ఫారాల లోని కోళ్లను స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ద్వారా బ్లీచింగ్ పౌడర్ సున్నం లను ఉపయోగించి కోళ్లను ఖననం చేసినట్లుగా పేర్కొన్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...