Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పశ్చిమ బెంగాల్ లో కమల వికాసం.. హ్యాట్రిక్ విజయాల తరువాత టీఎంసీకి ఎదురైన పరాజయం
posted on: May 4, 2026 11:47AM

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికలలో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పరాజయం పాలైంది. వరుసగా మూడు సార్లు రాష్ట్రంలో విజయం సాధించి అధికారంలో కొనసాగిన తృణమూల్ కు ఈ సారి పరాజయం తప్పలేదు. ముఖ్యంగా ఈ ఎన్నికలలో బీజేపీ వర్సెస్ మమతా బెనర్జీ అనే కంటే.. మమతా బెనర్జీవర్సెస్ సువేందు అధికారి అన్నట్లుగా సాగాయని చెప్పవచ్చు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సువేందు అధికారి గత ఎన్నికల్లో నందిగ్రామ్‌లో మమతను ఓడించారు. ఈ సారి ఆయన నందిగ్రామ్ తో పాటు మమత సొంత నియోజకవర్గమైన భవానీ పూర్ నుంచి కూడా ఆమె ప్రత్యర్థిగా రంగంలోకి దిగి ఆమెకు సవాల్ విసిరారు.
అది పక్కన పెడితే.. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి అధికారం దూరమైనట్టే. ఈసారి కూడా అధికారాన్ని దక్కించుకుంటామని గట్టిగా చెప్పిన మమత.. బెంగాల్ ప్రజలు ఈసారి మార్పు కోరుకున్న నేపథ్యంలో.. ఓటమి మూటగట్టుకోక తప్పలేదు. రాష్ట్రవ్యాప్త ట్రెండ్స్ గమనిస్తే, బీజేపీ మెజారిటీ మార్కు వైపు వేగంగా దూసుకుపోతోంది. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 148 కాగా, బీజేపీ 177 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యతతో ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ ఈ స్థాయిలో పట్టు సాధించడం తృణమూల్ కాంగ్రెస్‌కు తేరుకోలేని ఎదురుదెబ్బగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు, అధికార టీఎంసీ కేవలం 109 స్థానాలలో మాత్రమే ఆధిక్యంలో ఉంది. దీదీ కోటగా పేరుగాంచిన దక్షిణ కోల్‌కతా ప్రాంతంలో సైతం కమల వికాసం పరిశీలకులను సైతం విస్మయపరుస్తోంది.
రాష్ట్రంలో ఈ స్థాయిలో మమత నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ దెబ్బతినడానికి సువేందు అధికారి పాత్ర అత్యంత కీలకం అని చెప్పవచ్చు. ఒకప్పుడు మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా, నందిగ్రామ్ ఉద్యమంలో కీలక పాత్రధారిగా ఉన్న సువేందు.. ఇప్పుడు ఆమెకు ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా మారారు. 2021లో నందిగ్రామ్ వేదికగా మమతను ఓడించి చరిత్ర సృష్టించిన ఆయన.. ఈసారి మమత సొంత నియోజకవర్గం భవానీపూర్ లో ఆమెకు ప్రత్యర్థిగా బీజీపీ అభ్యర్థిగా బరిలోకి దిగా ఆమెకు చుక్కలు చూపించారు. ఒకప్పటి ఆమె అనుచరుడే.. ఇప్పుడు ఆమె అధికారం కల్పోవడానికి కారణంగా మారారని పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద పశ్చిమెంగాల్ లో కమలం జయకేతనం ఎగురవేయడం దేశ రాజకీయాలలో అత్యంత కీలక పరిణామంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.






