Latest News

రాత్రంతా బైక్ ఆన్...పొగ పీల్చి నలుగురు మృతి

posted on: Mar 15, 2026 12:32PM

 

చిత్తూరు జిల్లాలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. ఇంట్లోనే బైక్‌ను స్టార్ట్‌లో ఉంచి నిద్రపోవడంతో కార్బన్ మోనాక్సైడ్ అనే విషవాయువు వ్యాపించి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారక ఘటన పుంగనూరు పట్టణంలో ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఘటనతో పట్టణం మొత్తం విషాదంలో మునిగి పోయింది.స్థానికులు మరియు పోలీసుల వివరాల ప్రకారం… చిత్తూరు జిల్లాలోని పుంగనూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో నివసిస్తున్న కుటుంబానికి చెందిన వ్యక్తి ఇటీవల తన ద్విచక్ర వాహనానికి ఇంజిన్ బోర్ వేయించుకున్నాడు. 

వాహనం సరిగ్గా సెట్ కావాలంటే కొంతసేపు లేదా రాత్రంతా బైక్ స్టార్ట్‌లో ఉంచాలని మెకానిక్ సూచించాడు. మెకానిక్ ఇచ్చిన సలహా మేరకు ఇంటి యజమాని శనివారం రాత్రి బైక్‌ను ఇంటి గదిలోనే స్టార్ట్ చేసి తలుపులు మూసి నిద్రపోయారు. రాత్రంతా మూసివున్న గదిలో వాహనం నడుస్తుండడంతో సైలెన్సర్ నుంచి బయటకు వచ్చే కార్బన్ మోనాక్సైడ్ వాయువు గదిలోనే పేరుకుపోయింది. గాలి బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో ఆ గది మొత్తం విషవాయువుతో నిండిపోయింది. ఫలితంగా గదిలో నిద్రిస్తున్న తాత రామచంద్రయ్య (70), మనవడు కార్తీక్ (15), మనవరాళ్లు చందన (8), చరిత (8) ఆ విషవాయువు ను పీల్చి నిద్రలోనే మృతి చెందారు.

ఆదివారం ఉదయం వరకు ఇంటి తలుపులు తెరుచుకోకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి కిటికీ లోంచి లోపలికి చూడగా నలుగురు అపస్మారక స్థితిలో పడి ఉండడం గమనించిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అప్పటికే నలుగురు మృతి చెందినట్లు గుర్తించారు. అనంతరం మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన మెకానిక్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కార్బన్ మోనాక్సైడ్ వాయువు రక్తంలో కలిసినప్పుడు మనిషికి వెంటనే స్పృహ తప్పిపోతుంది. ఎలాంటి నొప్పి లేదా హెచ్చరిక లక్షణాలు లేకుండానే బాధితులు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.మూసి ఉన్న గదుల్లో వాహనాలను స్టార్ట్ చేయడం ఎంత ప్రమాదకరం... ప్రజలు ఇలాంటి నిర్లక్ష్య చర్యలకు పాల్పడకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...