లేడీ పొలిటీషన్స్ కోసం… యాంటీ రోమియో స్క్వాడ్ అవసరమా?
posted on: Apr 1, 2017 4:36PM
.jpg)
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వరుసగా తీసుకున్న నిర్ణయాల్లో అత్యంత వివాదాస్పదమైంది అక్రమ గోవధ శాలల మూసివేత. దాని తరువాత న్యూస్ లో బాగా వినిపించింది, కనిపించింది యాంటీ రోమియో స్క్వాడ్! ఈ స్క్వాడ్స్ అమ్మాయిలు, మహిళల్ని వేదించే ఈవ్ టీజర్ల తాట తీస్తున్నాయి. పోకిరీల్ని గజగజలాడిస్తున్నాయి. అయితే, యోగీజీ పార్టీకి చెందిన సీనియర్ నేతే ఇప్పుడు తలవంపులు తీసుకొచ్చారు. బీహార్ కు చెందిన ఆ బీజేపి నేత… ఇక ముందు చట్ట సభల్లో కూడా యాంటీ రోమియో స్క్వాడ్స్ ఏర్పాటు చేస్తే బావుంటుందోమో అనిపించేలా ప్రవర్తించాడు! అదీ తోటీ లేడీ ఎమ్మెల్సీతో…
బీహార్ బీజేపికి ఉపాధ్యక్షుడిగా వుండేవాడు లాల్ బాబూ ప్రసాద్! అయితే, ఈయన గారు గత బుధ వారం వున్నట్టుండీ నూతన్ సింగ్ అనే లేడీ ఎమ్మెల్సీని అసెంబ్లీ, కౌన్సిల్ రెండూ వుండే ప్రాంగణంలోనే వేధించాడు! హోదాలోనూ , వయస్సులోనూ పెద్దవాడే అయినా వంకర బుద్ది పోనిచ్చుకోలేదు. ఎవరూ చూడకుండా లోక్ జనశక్తి పార్టీకి చెందిన నూతన్ సింగ్ అనే మహిళా ఎమ్మెల్సీని లైంగికంగా ఇబ్బంది పెట్టాడు!
తనని వేధించిన లాల్ బాబూ ప్రసాద్ గురించి సదరు ఎమ్మెల్సీ భర్తకు కంప్లైంట్ చేసింది! ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే… లేడీ ఎమ్మెల్సీ భర్త బీజేపికే చెందిన ఎమ్మెల్యే, నీరజ్ కుమార్ సింగ్! ఆయనకి ఒళ్లు మండిపోవటంతో లాల్ బాబూ ప్రసాద్ వద్దకి వెళ్లి చితక్కొట్టేశాడు! కాని, గొడవ అక్కడితో ఆగలేదు. ప్రస్తుతం ఎమ్మెల్సీ అయిన లాల్ బాబూ గురించి కంప్లైంట్ బీహార్ శాసన మండలి చైర్ పర్సన్ నారాయణ్ సింగ్ వద్దకి వెళ్లింది. సాటి ఎమ్మెల్సీని లైంగికంగా వేధించటంపై అందరూ సీరియస్ అయ్యారు. నైతిక విలువల కమిటీ విచారణ జరుపుతోంది!
బీజేపి పార్టీ ఈ రోమియో ఎమ్మెల్సీని అర్జెంట్ గా పార్టీ నుంచి బహిష్కరించేసింది! ప్రాథమిక సభ్యత్వం కూడా రద్దు చేసింది. కాకపోతే, ఎన్ని చేసినా… అసలు ఇలాంటి నేతలు చట్ట సభల్లో వుంటే కాలేజీలు, హాస్టల్స్ ముందు పోకిరిలు బుద్ధిగా వుండమంటే ఎలా వుంటారు? ఆ మధ్య ఇదే బీహార్లో ఓ కాంగ్రెస్ ముసలాయన నగ్మ మీద స్వేచ్ఛగా చేయి వేసి చీవాట్లు తిన్నాడు. కేరళలో అయితే శ్వేత మీనన్ అనే నటిని మరో నాయకుడు పబ్లిగ్గా ఇబ్బంది పెట్టాడు! ఇలా చెబుతూ పోతే అన్ని పార్టీల్లోంచి పొలిటికల్ రోమియోలు బోలెడు మంది బయటకొచ్చేస్తారు! వీర్ని కంట్రోల్ చేయటానికి కూడా ఓ యాంటీ రోమియో స్క్వాడ్ ఏర్పాటు చేస్తే బావుంటుందేమో!




.jpg)


.webp)


