బీహార్ రాజకీయాల్లో అసదుద్దీన్ ఓవైసీ కలకలం
posted on Sep 24, 2015 2:07PM

రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే, బద్ధశత్రువులైనా మిత్రులైపోతారు, అప్పటివరకూ మిత్రులైనవారు శత్రువులుగా మారిపోతారు, ఇది ఎన్నోసార్లు రుజువైనా బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో మరోసారి కళ్లకు కట్టింది, ఏడాదిక్రితం మిత్రపక్షమైన బీజేపీతో తెగదెంపులు చేసుకున్న జేడీయూ...ఆగర్భ శత్రువైన ఆర్జేడీతో చేతులు కలిపింది. ఈ కలయిక రాజకీయాల్లో అంతగా ఆశ్చర్యాన్ని కలిగించకపోయినా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ విషయంలో సర్క్యులేట్ అవుతున్న ప్రచారం మాత్రం పెద్ద దుమారాన్నే రేపుతోంది.
కొన్ని ఆరోపణలు నిజమో కాదో తెలియదు గానీ కొన్నిసార్లు ఆయా పార్టీల భవిష్యత్ ను, నాయకుల తలరాతను తారుమారు చేస్తుంటాయ్, ఆ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఎన్నికల సమయంలో ప్రజల నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి, అలాంటిదే ఒకటి ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జరుగుతోంది. బీహార్ లో ఎంఐఎం పోటీకి దిగడంతో ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీని టార్గెట్ చేసిన జేడీయూ...అందర్నీ ఆశ్చర్యపరిచే ఆరోపణలు చేసింది. ప్రధాని నరేంద్రమోడీతో అసదుద్దీన్ రహస్యంగా సమావేశమయ్యారని, మోడీ సూచన మేరకే బీహార్ ఎన్నికల్లో ఎంఐఎం పోటీకి దిగిందని వ్యాఖ్యానించారు. తమ కూటమికి ముస్లిం ఓట్లు పడకుండా, మోడీ ఈ ప్లాన్ చేశారంటూ ఇటు బీజేపీని, అటు ఓవైసీపీని ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నించింది, ఈ దుమారం సద్దుమణగకముందే అసదుద్దీన్ పై మరో తీవ్రమైన ఆరోపణ చేసింది కాంగ్రెస్ పార్టీ
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ లు మత రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్....వీరిద్దరూ కలిసున్న ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేసి రాజకీయ మంట పుట్టించారు.అయితే ఆ ఫొటోను తనకెవరో పంపారని ట్విట్టర్లో తెలిపిన డిగ్గీ...బీహార్ లో ముస్లిం ఓట్లను చీల్చడానికి బీజేపీతో అసదుద్దీన్ కుమ్మక్కయ్యారంటూ ఆరోపించారు.ఈ రెండు పార్టీలూ మత రాజకీయాలకు పాల్పడుతూ దేశంలో అలజడి సృష్టిస్తున్నాయని, ముస్లిం ఓట్లను చీల్చడం ద్వారా బీజేపీకి లబ్ది చేకూర్చాలని ఓవైసీ ప్రయత్నిస్తున్నారని, ఈ మేరకు రెండు పార్టీల మధ్య రహస్య డీల్ కుదిరిందని దిగ్విజయ్ అంటున్నారు.అయితే ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ తో కలిపి తన ఫొటోను మార్ఫింగ్ చేయడంపై అసదుద్దీన్ ఓవైసీ మండిపడుతున్నారు. జేడీయూ, దిగ్విజయ్ లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానన్న అసదుద్దీన్...త్వరలో లీగల్ నోటీసులు పంపుతానని తెలిపారు. మరోవైపు బీజేపీ కూడా కాంగ్రెస్, జేడీయూ ఆరోపణలను ఖండించింది, ఆధారాల్లేకుండా ఆరోపణలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
అయితే ఎంఐఎం రాకతో ముస్లిం ఓట్లు తమకు దూరమవుతాయని, దాంతో గెలుపు అవకాశాలూ దెబ్బతింటాయని ఆందోళన చెందుతున్న జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ లు... అసదుద్దీన్ తో సంబంధాలు అంటగడ్డి బీజేపీని టార్గెట్ చేస్తున్నాయనేది మరో మాట, అయితే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కాబట్టి...ఒకవేళ సీక్రెట్ డీల్ కుదిరినా కుదిరి ఉండొచ్చని అంటున్నారు. ఇవన్నీ ఓటర్లను ప్రభావితం చేసే అంశాలే కాబట్టి పార్టీల అంచనాలు తలకిందులైనా ఆశ్చర్యపోనవసరం లేదు.