నేడో, రేపో బీహార్ అసెంబ్లీ ఎన్నికలకి నోటిఫికేషన్ జారీ?
posted on Sep 8, 2015 4:35PM
.jpg)
నేడో, రేపో బీహార్ శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత బీహార్ శాసనసభ పదవీ కాలం నవంబర్ 29తో ముగియబోతోంది. కనుక వచ్చే నెల మొదటి లేదా రెండవ వారం నుండి ఐదు దశలలో బీహార్ శాసనసభ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. నవంబర్ మొదటి వారంలోగా ఎన్నికల ఫలితాలను ప్రకటించవచ్చును. అయితే ఈ ఎన్నికల కోసం బీహార్ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఆరు నెలల ముందు నుండే సన్నాహాలు ప్రారంభించాయి. ఆ ప్రయత్నాలలో భాగంగానే బీహార్ ముఖ్యమంత్రిగా చేస్తున్న జీతన్ రామ్ మంజీని బలవంతంగా కుర్చీలో నుండి దింపేసి నితీష్ కుమార్ ఆ స్థానాన్ని ఆక్రమించారు. ఆ తరువాత ఆరు పార్టీలను కూడగట్టి జనతా పరివార్ అనే కూటమిని ఏర్పాటు చేసారు. కానీ ఈ మధ్యనే దానిలో నుంచి సమాజ్ వాదీ పార్టీ తప్పుకొని ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించింది.
ఈసారి బీహార్ ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేజిక్కించుకోవాలని పట్టుదలగా ఉన్న బీజేపీ ఓటర్లకు చాలా పెద్ద తాయిలమే ఎర వేసింది. ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ రాష్ట్రానికి రూ.1.25 లక్షల కోట్లు ఆర్ధిక ప్యాకేజీని మరో రూ.40, 000 కోట్లు మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఇంతవరకు అసంఘటితంగా ఉన్న వామపక్షాలన్నీ ఈసారి చేతులు కలిపాయి. ఈ ఎన్నికలలో మతతత్వ బీజేపీని, కులతత్వ ‘జనతా పరివార్’ని వాటితో జత కట్టిన కాంగ్రెస్ పార్టీని, ఒంటరిగా బరిలోకి దిగుతున్న సమాజ్ వాదీ పార్టీని ఓడిస్తామని వామపక్ష కూటమి చెపుతోంది. కానీ సాధారణంగా ఎన్నికలలో ఇన్ని పార్టీలు, కూటములు బరిలో ఉన్నట్లయితే ప్రజల ఓట్లు చీలుతుంటాయి. కనుక బీహార్ ఎన్నికలలో కూడా అదే జరుగవచ్చును. ఎవరికీ పూర్తి మెజార్టీ రానట్లయితే బీహార్ రాజకీయాలు ఇంకా దిగజారిపోవచ్చును.