భోపాల్ గ్యాస్ దుర్ఘటన: మానవాళిని కుదిపేసిన పారిశ్రామిక విషాదం.!

posted on: Jul 31, 2026 5:23AM

ప్రపంచ పారిశ్రామిక చరిత్రలోనే చీకటి రోజుగా మిగిలిపోయిన భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగి నాలుగు దశాబ్దాలు దాటుతున్నా, దానివల్ల కలిగిన గాయాలు,  మానసిక క్షోభ ఇంకా మానలేదు. 1984 డిసెంబరు 2,3 తేదీల మధ్యరాత్రి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని ఒక రసాయన కర్మాగారం నుంచి వెలువడిన విషవాయువు వేలాది మంది  ప్రాణాలను క్షణాల్లో తీసివేసింది. వేలాది మంది నిద్రలోనే ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది తీవ్రమైన దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల బారిన పడ్డారు. ఈ ఘోర పారిశ్రామిక విపత్తుకు కారణమైన మాతృ సంస్థ అధిపతి, అమెరికన్ పౌరుడైన వారెన్ ఆండర్సన్‌ను స్థానిక పోలీసులు అరెస్టు చేసినప్పటికీ, కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఆయనను విడుదల చేసి దేశం దాటించడం అప్పట్లో తీవ్ర దుమారాన్ని రేపింది. చట్టపరమైన విచారణకు హాజరుకాకుండానే ఆయన దశాబ్దాల పాటు స్వేచ్ఛగా జీవించి మరణించడం, భారతీయ న్యాయ వ్యవస్థలో లోపాలకు అద్దం పట్టింది.   ఈ విపత్తు వెనుక ఉన్న నేపథ్యాన్ని పరిశీలిస్తే, అమెరికాకు చెందిన యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ (యూసీసీ) తన భారత అనుబంధ సంస్థ ద్వారా భోపాల్ నగరంలో పురుగుమందుల తయారీ యూనిట్‌ను నడిపేది. ఈ ప్లాంట్‌లో 'మిథైల్ ఐసోసైనేట్' (ఎమ్ఐసీ) అనే అత్యంత ప్రమాదకరమైన  రసాయనాన్ని భారీ ట్యాంకులలో నిల్వ చేసేవారు. అయితే, ఈ కర్మాగారంలో భద్రతా ప్రమాణాలను  నిర్లక్ష్యం చేశారు. ఆ కారణంగానే 1982లోనే ప్లాంట్‌లో సంభవించిన చిన్న  లీక్ ఘటనలో అష్రఫ్ ఖాన్ అనే కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. అయినా యాజమాన్యం సరైన రక్షణ చర్యలు తీసుకోలేదు. నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకోవాలనే ఉద్దేశంతో అత్యవసర భద్రతా వ్యవస్థల మరమ్మతులను నిలిపివేసారని, నిపుణులైన సిబ్బంది సంఖ్యను తగ్గించారని నివేదికలు స్పష్టం చేశాయి.  

సంఘటన జరిగిన డిసెంబరు 2 రాత్రి, విష రసాయనాలు ఉన్న ట్యాంకులోకి నీరు చేరుకోవడంతో తీవ్రమైన ఉష్ణోగ్రత, ఒత్తిడి పెరిగి రసాయనిక చర్య జరిగింది. దీనితో ట్యాంక్ నుంచి పెద్ద ఎత్తున విషవాయువు బయటకు వచ్చి పరిసర ప్రాంతాలను కమ్మేసింది. నిద్రపోతున్న ప్రజలు శ్వాస తీసుకోలేక, కళ్ల మంటలతో వీధుల్లోకి పరుగులు తీస్తూ కుప్పకూలిపోయారు. ప్రభుత్వ అధికారిక అంచనాల ప్రకారం 3,787 మంది మరణించారని ప్రకటించినప్పటికీ, బాధితుల సంక్షేమ సంఘాల లెక్కల ప్రకారం ఈ సంఖ్య 15 వేల నుంచి పాతిక వేల వరకు ఉంటుందని తేలింది. ఐదు లక్షలకు పైగా పౌరులు ఈ విషపూరిత వాయువు ప్రభావానికి గురై వికలాంగులుగా మారిపోయారు.  దుర్ఘటన తీవ్రతను పరిశీలించేందుకు 1982 డిసెంబరు 7న యూనియన్ కార్బైడ్ కంపెనీ చైర్మన్ వారెన్ ఆండర్సన్ భోపాల్ చేరుకోగా, స్థానిక పోలీసులు ఆయనపై తీవ్రమైన నేరారోపణల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కానీ..  అదే రోజు మధ్యాహ్నం పాతిక వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై ఆయనకు  బెయిల్ మంజూరైంది. అంతేకాకుండా.. ఆయనను ప్రత్యేక ప్రభుత్వ విమానంలో ఢిల్లీకి తరలించి, అక్కడి నుంచి అమెరికాకు సురక్షితంగా పంపించివేశారు. ఆ తర్వాత ఆండర్సన్ మళ్లీ ఏనాడూ భారతదేశంలో అడుగుపెట్టలేదు. 

1989లో యూనియన్ కార్బైడ్ సంస్థ భారత ప్రభుత్వంతో 470 మిలియన్ డాలర్ల నష్టపరిహార ఒప్పందం చేసుకుంది. ఇది కేవలం పౌర బాధ్యతల నుంచి ఉపశమనం పొందే ఒప్పందమే తప్ప, క్రిమినల్ విచారణను భర్తీ చేసేది కాదు.  న్యాయపోరాటంలో భాగంగా 1992లో భోపాల్ కోర్టు ఆండర్సన్‌ను  పరారీలో ఉన్న నిందితుడుగా ప్రకటించి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అయినప్పటికీ..  ఆ వారెంట్ అమలు కాలేదు. 1996లో అత్యున్నత న్యాయస్థానం స్థానిక అధికారులపై ఉన్న అభియోగాల తీవ్రతను  సదోషమైన నరహత్య  నుంచి 'నిర్లక్ష్యం వల్ల కలిగిన మరణంగా తగ్గించింది. దీంతో 2010లో భోపాల్ కోర్టు కేవలం ఏడుగురు భారతీయ అధికారులకు స్వల్ప జైలు శిక్ష విధించగా, వారు వెంటనే బెయిల్‌పై బయటకు వచ్చారు. ప్రధాన నిందితుడైన ఆండర్సన్ అమెరికాలోని ఫ్లోరిడాలో 2014 సెప్టెంబరు 29న 92 ఏళ్ల వయసులో మరణించే వరకు ఎలాంటి శిక్ష అనుభవించకపోవడం గమనార్హం.  ఆండర్సన్‌ను అరెస్టు చేసిన వెంటనే విడుదల చేయడం వెనుక నాటి రాజకీయ నిర్ణయాలు ఉన్నాయనే వివాదం నేటికీ కొనసాగుతోంది. 

నాటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అర్జున్ సింగ్ ఆదేశాల మేరకు తాను ఆండర్సన్‌ను విడుదల చేశానని నాటి జిల్లా కలెక్టర్ మోతీ సింగ్ తన గ్రంథంలో పేర్కొన్నారు. అయితే, కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఒత్తిడి,  సూచనల మేరకే తాను ఆ చర్య తీసుకున్నానని అర్జున్ సింగ్ తన ఆత్మకథలో రాసుకొచ్చారు. నాటి ప్రధాని రాజీవ్ గాంధీ ప్రభుత్వంపై కూడా ప్రతిపక్షాలు,  బాధిత సంఘాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. విదేశీ పెట్టుబడులు,  దౌత్య సంబంధాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం జరిగిందనే విమర్శలు ఉన్నప్పటికీ, న్యాయస్థానాలలో ఇవి అధికారికంగా నిరూపణ కాలేదు.  భోపాల్ విపత్తు ప్రభావం కేవలం ఆ తరంతో ముగిసిపోలేదు. 

విషవాయువును పీల్చిన లక్షలాది మంది ప్రజలు క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులు, మూత్రపిండాల వైఫల్యం,  అంధత్వంతో బాధపడుతున్నారు. తదనంతర తరాల్లో జన్మించిన పిల్లలలో కూడా జన్యుపరమైన లోపాలు, వైకల్యాలు కనిపిస్తున్నాయని వైద్య నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాకుండా, ప్లాంట్ ఆవరణలో ఉన్న రసాయన వ్యర్థాలు భూగర్భ జలాల్లోకి ఇంకిపోవడంతో నగరంలోని పలు ప్రాంతాల నీరు నేటికీ కలుషితంగానే ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బాధితులు దశాబ్దాలుగా పూర్తిస్థాయి పరిహారం,  వైద్య సదుపాయాల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు.  ఈ పారిశ్రామిక దుర్ఘటన అంతర్జాతీయంగా బహుళజాతి సంస్థల బాధ్యతపై కొత్త చర్చకు తెరతీసింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పరిశ్రమలు స్థాపించేటప్పుడు పాటించాల్సిన భద్రతా నియమాలు, పర్యావరణ పరిరక్షణ, చట్టపరమైన బాధ్యతలపై కఠిన నిబంధనల అవసరాన్ని ఈ ఘటన ప్రపంచానికి గుర్తుచేసింది.  నలభై ఏళ్ల క్రితం జరిగిన ఈ దారుణం, న్యాయం జాప్యమైతే అది న్యాయాన్ని తిరస్కరించడమే అవుతుందనే నిజానికి   నిదర్శనంగా మిగిలిపోయింది. 

 -సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.       

Bhopal gas tragedy, Warren Anderson escape, Union Carbide Bhopal, Methyl Isocyanate leak, Rajiv Gandhi Bhopal disaster, Bhopal gas victims justice

google-ad-img
    Related Sigment News
    • Loading...