Latest News
భారతి బిల్డర్స్‌పై రూ.4.74 కోట్ల జరిమానా
posted on: Mar 13, 2026 8:59PM

రియల్ ఎస్టేట్ రంగంలో నిబంధనలు ఉల్లంఘించిన నిర్మాణ సంస్థపై కఠిన చర్యలు తీసుకుంటూ తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ భారీ జరిమానా విధించింది. మేడ్చల్ జిల్లా కొంపల్లి ప్రాంతంలో ప్రతిపాదించిన “భారతి లేక్ వ్యూ అపార్ట్‌మెంట్స్” ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టిన అనంతరం భారతి బిల్డర్స్‌పై రూ.4.74 కోట్ల జరిమానా విధిస్తూ రెరా కీలక ఆదేశాలు జారీ చేసింది. 2021 సంవత్సరంలో ప్రీ-లాంచ్ స్కీమ్ పేరుతో భారతి బిల్డర్స్ కొనుగోలుదారులకు ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించింది. ప్రాజెక్టు త్వరలో ప్రారంభమవుతుందని చెబుతూ పలువురు కొనుగోలుదారులను నమ్మించి వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో అడ్వాన్స్‌లు, బుకింగ్ అమౌంట్‌లు వసూలు చేసినట్లుగా అధికారుల దర్యాప్తులో తేలింది.
అయితే ప్రాజెక్టుకు అవసరమైన రెరా రిజిస్ట్రేషన్ లేకుండానే ప్రజలను నమ్మించి పెద్ద ఎత్తున డబ్బులు సేకరించడం చట్టవ్యతిరేకమని అధికారులు స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్) చట్టం ప్రకారం, రెరా అనుమతి లేకుండా ప్రాజెక్టులను మార్కెట్ చేయడం లేదా కొనుగోలుదారుల నుంచి నిధులు సేకరించడం నిషేధిత చర్య....ఈ వ్యవహా రంపై ఫిర్యాదులు అందడంతో తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అధికారులు సమగ్ర విచారణ చేపట్టారు. విచారణలో ప్రాజెక్టుకు ఎలాంటి అధికారిక అనుమతులు లేకపోవడం మాత్రమే కాకుండా, ఇప్పటి వరకు నిర్మాణ పనులు కూడా ప్రారంభించలేదు. కొనుగోలుదారుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు సేకరించినప్పటికీ ప్రాజెక్టు పురోగతి లేకపోవడం రెరా దృష్టికి వచ్చింది.
దీంతో సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించిన అధికారులు వెంటనే ఆ సంస్థపై భారీ జరిమానా విధించారు. అదే సమ యంలో, బాధిత కొనుగోలుదారులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో రెరా కీలక ఆదేశాలు జారీ చేసింది. కొనుగోలుదారుల నుంచి వసూలు చేసిన మొత్తం డబ్బులను వడ్డీతో సహా 60 రోజుల్లో తిరిగి చెల్లించాలని భారతి బిల్డర్స్‌కు గట్టిగా ఆదేశాలు జారీ చేసింది. నిర్దేశించిన గడువులోగా డబ్బులు తిరిగి చెల్లించకపోతే మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది.
అదేవిధంగా, నిబంధనలు ఉల్లంఘించినం దుకు భారతి బిల్డర్స్‌ను రెరా “డిఫాల్టర్ ప్రమోటర్”గా ప్రకటించింది. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలపై ఎలాంటి ఉపేక్ష ఉండదని, రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత కోసం రెరా కఠినంగా వ్యవహరిస్తుందని అధికారులు స్పష్టంచేశారు.ఈ నేపథ్యంలోనే ప్రజలకు కూడా రెరా ముఖ్య సూచనలు చేసింది. ఏదైనా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టే ముందు ఆ ప్రాజెక్టుకు రెరా రిజిస్ట్రేషన్ ఉందా లేదా అన్నది తప్పనిసరిగా పరిశీలించాలని సూచించింది.
రెరా వెబ్‌సైట్‌లో ప్రాజెక్టు వివరాలు, అనుమతులు, నిర్మాణ పురోగతి వంటి సమాచారం అందుబాటులో ఉంటుందని, వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కొనుగోలుదారులకు సూచించింది.రియల్ ఎస్టేట్ రంగంలో కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడటానికి ఈ చర్యలు తీసుకున్నట్లు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అధికారులు తెలిపారు. అక్రమంగా డబ్బులు సేకరించే బిల్డర్లపై కఠిన చర్యలు కొనసాగుతాయని కూడా హెచ్చరించారు.


.webp)



