సామాన్యులకు మెరుగైన, నాణ్యమైన వైద్యం.. ఏపీ సర్కార్ కొత్త పథకం

posted on: Apr 30, 2026 8:31AM

ఆంధ్రప్రదేశ్   ప్రజలకు మెరుగైన,  నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. త్వరలోనే రాష్ట్రంలో సరికొత్త ఆరోగ్య పథకాన్ని పట్టాలెక్కించబోతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. సామాన్యులకు సైతం అత్యాధునిక వైద్య చికిత్సలను ఉచితంగా అందించడమే ఈ పథకం  ప్రధాన ఉద్దేశమన్నారు. 

గత ప్రభుత్వ హయాంలో వైద్య రంగంలో నెలకొన్న లోపాలను సరిదిద్దుతూ.. వ్యవస్థను ప్రక్షాళన చేయడమే   మొదటి ప్రాధాన్యతగా తెలుగుదేశం కూటమి సర్కార్ ముందుకు వెడుతోంది.  మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించిన మేరకు.. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, మందుల కొరత లేకుండా  ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కొత్తగా తీసుకురాబోయే ఆరోగ్య పథకం ద్వారా పేద,   మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి వస్తుంది. 

వైద్య రంగంలో తీసుకురావాల్సిన సంస్కరణలపై ప్రభుత్వం ఇప్పటికే ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను  బలోపేతం చేయడం ద్వారా  మారుమూల ప్రాంతాల వారికి కూడా సకాలంలో వైద్య సేవలు అందేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. టెలీ మెడిసిన్ వంటి సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా నిపుణులైన డాక్టర్ల సలహాలను గ్రామ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది.

గతంలో ఉన్న పథకాలలోని లొసుగులను తొలగించి, లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శక  విధానంలో ఈ కొత్త పథకాన్ని అమలు చేయడానికి  కసరత్తు చేస్తున్నది. నిధుల కేటాయింపు విషయంలో కూడా ప్రభుత్వం సానుకూల ధోరణితో ఉన్నట్లు కనిపిస్తోంది. అత్యవసర సమయాల్లో ప్రజలు ఆసుపత్రుల చుట్టూ తిరగకుండా..  తక్షణ సహాయం అందేలా వ్యవస్థను రూపొందిస్తున్నది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ నిర్ణయంపై   హర్షం వ్యక్తమవుతోంది. పెరుగుతున్న వైద్య ఖర్చుల దృష్ట్యా..  ప్రభుత్వం అందించే ఉచిత వైద్యం సామాన్యులకు ఊరటనిస్తుందని పరిశీలకులు అంటు న్నారు.  ఈ పథకానికి సంబంధించిన పూర్తి నిబంధనలు, విధివిధానాలను త్వరలో అధికారికంగా వెల్లడించనున్నట్లు మంత్రి చెప్పారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...