అమిత్ షాకి అన్నం పెట్టారు… మమతా బెనర్జీకి జై కొట్టారు!
posted on May 3, 2017 1:17PM

రాజకీయ నాయకులు మనసుతో కంటే ఎక్కువగా మెదడుతోనే పని చేస్తారు! ఇది అందరికీ తెలిసిందే! ఆనందంగా వున్నప్పుడు మాటివ్వటం, కోపంలో వున్నప్పుడు శపథం చేయటం… నిజమైన నేతలు అస్సలు చేయరు! కానీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాత్రం డిఫరెంట్! ఆమె రెచ్చిపోతారు. ఎదుటివారు రెచ్చగొడితే మరింత రెచ్చిపోతారు. దీని వల్ల ఆమె లాభపడిన సందర్భాలూ వున్నాయి… నష్టపోయిన సందర్బాలు కూడా వున్నాయి!
మమత గతంలో ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు బోలెడు. అసలు ఆమెలా కోపంతో, కసితో రాజకీయం చేసే వారు పాలిటిక్స్ లో చాలా అరుదు. కాని, అదృష్టవశాత్తూ ఆమె తన స్వంత రాష్ట్రంలో కమ్యూనిస్టుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. వాళ్ల విషయంలో ఆమె నేచర్ చక్కగా సూటైపోయింది. ఆవేశంగా బరిలోకి దూకి జనంలో శివాలెత్తిపోయింది. అంతే, బెంగాలీలు కమ్యూనిస్టుల్ని కాదని మమతకు పట్టం కట్టారు. ఎర్ర దండు కూడా ముప్పై ఏళ్ల అధికారం కారణంగా ఎంత మాత్రం తెలివైన వ్యూహాలు పన్నలేక దౌర్జన్యంగా తృణమూల్ ను అణచాలని ప్రయత్నించి బోర్లాపడింది. ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ తరువాతి స్థానంలో మూడో ప్లేస్ లోకి కూరుకుపోయింది!
లెఫ్ట్ పార్టీల విషయంలో మమత స్ట్రాటజీ పని చేసింది కాని… మోదీ, అమిత్ షాల సారథ్యంలోని బీజేపి విషయంలో బెనర్జీ వ్యూహం బెడిసికొడుతున్నట్టు కనిపిస్తోంది. అంతకంతకూ మమత వ్యవహార శైలి బెంగాలీల్లో అసంతృప్తి పెంచుతోంది. దీదీ ముస్లిమ్ లకు మాత్రమే అనుకూలంగా పాలన చేస్తున్నారని బీజేపీ చేసే ఆరోపణలు నమ్మే వారు రోజు రోజుకి ఎక్కువవుతున్నారు. మొన్నటికి మొన్న శ్రీరామ నవమి శోభాయాత్రల పేరుతో బీజేపీ, ఆరెస్సెస్ తమ పట్టు ప్రదర్శించాయి కోల్ కతా, ఇతర నగరాల్లో! అదే సమయంలో, మమత పట్టుదలకి పోయి రామ నవమి ర్యాలీల్ని , పూజల్ని నిషేధించే ప్రయత్నం చేసింది. అది జనం దృష్టిలో తప్పుగా మిగిలిపోవటమే కాకుండా హైకోర్టు కూడా వ్యతిరేక తీర్పునిచ్చింది. అంతకు ముందు సరస్వతీ పూజ జరుపుకునే విషయంలో కూడా బెంగాలీల్ని తృణమూల్ సర్కార్ ఇబ్బంది పెట్టిందని ఆరోపణలు వున్నాయి!
బీజేపి మత ప్రాతిపదికన వేసే ఎత్తులకి మమత కౌంటర్ ఇవ్వటంలో అవసరానికి మించి ఆవేశపడుతన్నట్టే కనిపిస్తోంది. కమలం వారు ఆశిస్తున్నది కూడా అదే! తాజాగా నక్సల్ బరి ఏరియాలో ఒక సాదాసీదా మధ్య తరగతి కుటుంబాన్ని పట్టుబట్టి మమత తృణమూల్ లో చేర్పించుకున్నారు. రాజు అనే ఆయన పెయింటర్ గా పని చేస్తాడు. అతడి భార్య గీత పొలం పనులకు వెళుతుంటుంది. వీరిద్దర్నీ రెండు రోజులు ఎవ్వరికీ కనిపించనీయలేదు తృణమూల్ నేతలు! వారు కిడ్నాప్ అయ్యారని లోకల్ బీజేపీ నాయకులు కంప్లైంట్లు కూడా ఇచ్చాక… మీడియాలో వార్తలొచ్చాక… అనూహ్యంగా రాజు, గీతా బయటకొచ్చారు. తాము తమ ఇష్టానుసారమే తృణమూల్ లో చేరుతున్నామని ప్రకటించారు!
అసలు ఒక సాదాసీదా మధ్యతరగతి కుటుంబం పార్టీలో చేరితే ఇంత హడావిడి ఎందుకు? మరేం లేదు… ఈ గీతా, రాజు అనే దంపతులు కొన్నాళ్లు కిందట అమిత్ షా బెంగాల్ లో పర్యటించినప్పుడు తమ ఊళ్లో భోజనం పెట్టారు. అది పెద్ద వార్తగా మారింది మీడియాలో! షాకి అందరి ముందు ఆతిథ్యం ఇచ్చిన సదరు భార్యా, భర్తల్ని మమత సైన్యం టార్గెట్ చేసింది. రెండు రోజులు కనిపించకుండా చేసి… కిడ్నాప్ వార్తల కలకలం తరువాత తమ పార్టీలో చేర్చుకుంటున్నట్టు ప్రకటన చేసింది! ఇందులో తమ ఒత్తిడి ఏం లేదని తృణమూల్ నేతలు చెబతున్నా… అమిత్ షాకు భోజనం పెట్టిన వార్నే ప్రత్యేకంగా పార్టీలోకి ఆహ్వానించటం … స్పష్టమైన సైంకేతాలే పంపుతుంది!
అమిత్ షా ఎత్తులకి పై ఎత్తులు వేస్తే బాగానే వుంటుంది కాని… ఆయన ప్రతీ పనికి ప్రతీకారం చూపిస్తూ పోతే మమత జనం ముందు చులకన అయ్యే ప్రమాదం వుంది! అంతే కాక ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం హోదాకు ఎగబాకుతున్న బెంగాల్ బీజేపి బెనర్జీ ప్రతీకారం ఎంత తీవ్రంగా వుంటే అంతగా లాభపడుతుంది!