బెల్జియంలో ఉగ్రవాదులు... అణువిధ్వంసానికి ప్రయత్నించారు

posted on: Mar 25, 2016 10:43AM


 

బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో జరిగిన ఉగ్రదాడి యూరోప్‌ ఖండాన్ని వణికించింది. అక్కడి విమానాశ్రయంలోనూ, మెట్రో స్టేషన్లలోనూ జరిగిన ఈ ఆత్మాహుతి దాడులలో 30 మందికి పైగా చనిపోయినట్లు సమాచారం. ఈ దాడి తరువాత బయటపడుతున్న నిజాలు మరింత దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. తీవ్రవాదులు నిజానికి బెల్జియంలో ఒక అణువిధ్వంసానికి ప్రయత్నించారా! అంటే అవుననే జవాబిస్తున్నాయి అక్కడి నిఘాసంస్థలు. ఉగ్రవాదులు ముందుగా బెల్జియంలోని అణువిద్యుత్‌ కేంద్రాలని లక్ష్యంగా చేసుకున్నారనీ, కొద్ది రోజుల క్రితం వారి సహచరుడిని బెల్జియం పోలీసులు అరెస్టు చేయడంతో, లక్ష్యాలను మార్చుకున్నారని తెలుస్తోంది. ఒకవేళ వారి పన్నాగం కనుక నెరవేరి ఉంటే, జరిగే ప్రమాదాన్ని ఊహించడానికే కష్టంగా ఉంది.

 

బెల్జియం నిఘావర్గాలు కనుక అప్రమత్తంగా వ్యవహరించి ఉంటే, ప్రస్తుత దాడులు కూడా జరిగేవి కావని అంటున్నారు. ఒక ఉగ్రవాదిని అరెస్టు చేసినప్పటికీ, మరింతమంది ఉగ్రవాదులు దేశంలో సంచరిస్తున్నారని తెలిసినప్పటికీ... బెల్జియం రక్షణవర్గాలు చూసీ చూడనట్లు వ్యవహరించాయంటున్నారు. యూరోపు దేశాల మధ్య సమన్వయం లేకపోవడం కూడా ఈ దాడులకు కారణంగా తెలుస్తోంది. ఈ దేశాలు, తమ మధ్య నిఘా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే మాట అటుంచితే... ఇతర దేశాలు అందించే సమాచారాన్ని కూడా చులకనగా చూస్తాయట. అందుకే ప్యారిస్‌లో గత ఏడాది దాడులకు పాల్పడినవారే, ఇప్పుడు బెల్జియంలోనూ దాడులు చేసే అవకాశం చిక్కింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...