ఏపీలో బెగ్గింగ్ పై బ్యాన్
posted on Nov 1, 2025 10:27AM
.webp)
ఏపీలో యాచక వృత్తిని నిషేధిస్తూ తెలుగుదేశం కూటమి జీవో పాస్ చేసింది. ఆ జీవో ప్రకారం ఇకపై ఏపీలో ఎవ్వరూ అడ్డుకోడానికి వీల్లేదు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది. ఎందుకంటే.. ఇప్పటికే బెగ్గింగ్ మాఫియా ఒక రేంజ్ లో చెలరేగిపోతోంది. బెగ్గింగ్ మాఫియా ఇందులోకి పిల్లలు, వృద్ధులు, మహిళలను దించుతూ అరాచకాలకు పాల్పడుతోంది.
అంతే కాదు ఇటీవలి కాలంలో ఈ మాఫియా మరో భయంకరమైన దోపిడీకి కూడా తెరలేపింది. కార్లకు ఉండే, ఫాస్ట్ టాగ్ స్టిక్కర్ల నుంచి కూడా వీరు దోపిడీ మొదలు పెట్టేశారు. జంక్షన్లలో వాహనాలు ఆగినపుడు ఆయా కార్లకున్న ఈ ఫాస్ట్ టాగ్ స్టిక్కర్ ను తమ స్కానర్ ద్వారా లాగేసుకుని.. వారి అకౌంట్లో ఆ మొత్తం పడిపోయేలాంటి కొత్త టెక్నిక్ వాడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతే కాకుండా ఇక బెగ్గింగ్ మాఫియా కారణంగా కొన్ని వేల మంది చిన్నారులు బలవుతున్నారు. కొందరు జంక్షన్లలో అది పనిగా బిచ్చగాళ్ల వేషం వేసుకుని, ఆపై తమకు ఎలాంటి వైకల్యం లేకున్నా ఉన్నట్టు నటిస్తూ వీరు చేసే యాక్టింగ్ మరో లెవెల్ కు చేరింది.
ఇంకొందరు తమకెన్ని ఆస్తిపాస్తులున్నా సరే.. గుడులు గోపురాల దగ్గర యాచిస్తూ.. బాగానే వెనకేస్తున్నారు. బెంగళూరు వంటి ప్రాంతాల్లో సాఫ్ట్ వేర్ జాబ్స్ వదిలి యాచక వృత్తిలోకి వెళ్లిన వారున్నారంటే అతిశయోక్తి కాదు. కారణమేంటంటే వారికి ఆ ఉద్యోగంలో ముప్పై నుంచి నలభై వేలు మాత్రమే వస్తుంటే ట్రాఫిక్ పోల్స్ దగ్గర రోజంతా అడుక్కుంటే 80 వేల నుంచి లక్ష రూపాయల వరకూ వస్తుండటంతో వారీ పనిలోకి దిగుతున్నట్టు అప్పట్లో ఒక వార్త హల్ చల్ చేసింది. అలాంటి యాచకవృత్తిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధించింది. దీనిని ఒక ఆత్మగౌరవ చర్యగా చెప్పాలి. అన్నిటికీ మించి ప్రభుత్వం ఇన్నేసి సంక్షేమ పథకాలను ఇస్తుంటే ఇక యాచించడం అవసరం లేదన్నది కూడా ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.