Latest News
తెలుగు జాతి కాంతి పుంజం.. 44 వసంతాల తెలుగుదేశం
posted on: Mar 29, 2026 8:18AM

తెలుగుజాతి మనది.. నిండుగ వెలుగు జాతి మనది అన్న భావనను నిలువెల్లా నింపుకున్న పార్టీ తెలుగుదేశం. అధకారంలో ఉన్నా, లేకున్నా తెలుగు జాతి అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నేటికి సరిగ్గా 44 సంవత్సరాలు. 1982 మార్చి 29 న తెలుగుదేశం పార్టీ ఆవిర్బావం తెలుగువారి చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. తెలుగు ప్రజల ఆత్మ గౌరవం చితికిపోయి, తెలుగు జాతి అవమానభారంతో కుంగిపోతున్న చారిత్రక సమయంలో కారు చీకటిలో కాంతి పుంజంలా తెలుగుదేశం పార్టీ ఆవిర్బవించింది. సమాజమే దేవళం, ప్రజలే దేవుళ్ళు అని ఎలుగెత్తి చాటింది. నలభై నాలుగేళ్లుగా తెలుగు ప్రజల సామాజిక, సాంస్కృతిక , రాజకీయ, ఆర్ధిక పురోగమనంలో ప్రతి అడుగులోనూ తెలుగుదేశం పార్టీ తనదైన ముద్ర వేసింది. ప్రజల గుండెల్లో చెరగని స్థానాన్ని పదిలం చేసుకుంది.
తెలుగు సినీ వినీలాకాశంలో దశాబ్దాల పాటు జగజ్జేయమానంగా వెలిగిన నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) అరవైయేళ్ళ వయసులో రాజకీయ రంగ ప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి.. తెలుగువాడిని, వేడినీ ప్రపంచానికి చాటారు.. పార్టీ ప్రకటించిన మరుక్షణం నుంచి అయన అన్ని వర్గాల ప్రజలతో మమేకమై స్పూర్తి రగిలించిన తీరు అనితరసాధ్యం. తెలుగువారిలో నెలకొన్న నిస్తేజాన్ని పారదోలడానికి కంకణం కట్టుకున్న నందమూరి తారక రామారావును తెలుగు సమాజం నిండు మనసుతో ఆశీర్వదించింది. ఆత్మీయంగా హత్తుకుంది. తెలుగుదేశం అవతరణను తెలుగు జాతి రాజకీయ చరిత్రలో ఒక కొత్త మలుపుగా ఆహ్వానించింది. తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా! అని ఆయనిచ్చిన పిలుపునకు తెలుగుజాతి ఉవ్వెత్తున స్పందించింది. ఆంధ్రుల భవితను దేదీప్యమానం చేయాలని పరితపించిన ఎన్టీఆర్ కు కుల, మత, వర్గ భేదాలు లేకుండా ప్రజానీకం బ్రహ్మరథం పట్టింది.
1983లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన చారిత్రక ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించి పెట్టింది.
అప్పటి నుంచి తెలుగువారి కీర్తి పతాకను తెలుగుదేశం పార్టీ ప్రపంచం నలుచెరుగులా చాటుతూనే ఉంది. సమూల మార్పులు తీసుకురావడానికి, ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి తెలుగుదేశం పార్టీ ఆవిరళ కృషి చేసింది. ,చేస్తోంది. పార్టీ స్థాపన నుంచి ఇప్పటివరకు అధికారంలోను, ప్రతిపక్షంగాను కూడా తెలుగుదేశం సదా ప్రజల పక్షానే నిలిచింది. ప్రజా ప్రయోజనాల కోసమే పరితపించింది.
తెలుగు సమాజం మీద తెలుగేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ముద్ర ఎన్నటికి చెరిగిపోనిది. నటుడిగా అయన కృషి అజరామరం. రాజకీయ నాయకుడిగా అయన 14 ఏళ్ల ప్రస్థానంలో అయన ప్రభావం మహత్తరం. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేయడంతో పాటు, తెలుగు సమాజంలో ఫ్యూడల్ వ్యవస్థలను నిర్మూలించి, అట్టడుగు వర్గాల సామాజిక, రాజకీయ ఉన్నతికి తోడ్పడం లో ఎన్టీఆర్ చూపించిన చొరవ నభూతో నభవిష్యతి.
తెలుగు పౌరుషాన్ని తట్టిలేపిన కీర్తి ఎన్టీఆర్ దే అనడంలో సందేహం లేదు. ఇక తెలుగువారి జీవన ప్రమాణాలను పెంచిన ఘనత నిస్సందేహంగా ప్రస్తుత ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ అద్యక్షుడు నారాచంద్రబాబు నాయుడిది. విద్యా, ఉద్యోగ, ఆర్ధిక రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు వారి ఎదుగుదల వెనుక అయన కృషి, దూరదృష్టి ఎవరూ కాదనలేరు. తెలుగు జాతికి ప్రపంచంలో ఎన్టీఆర్ గుర్తింపు తెస్తే, తెలుగు ప్రతిభ అంతర్జాతీయ స్థాయిలో తలెత్తుకుని నిలిచేలా చేశారు చంద్రబాబు. ఎన్టీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ఒక రాజాకీయ శక్తిగా ఎదిగితే, చంద్రబాబు అధ్వర్యంలో రాజకీయంగానూ, ఆర్ధికంగానూ కూడా నిలబడింది. బలపడింది.
చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆధునికతను సంతరించుకుంది. తెలుగువారి కీర్తీ ప్రతిష్టలను అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసింది. ప్రపంచంలో జరుగుతున్నమార్పులను ముందే గ్రహించి, అందుకు అనుగుణంగా తెలుగువారిని, తెలుగు రాష్ట్రాన్ని సంసిద్ధం చేయడంలో చంద్రబాబు దార్శనికత ప్రపంచ దేశాల అధినేతలు కూడా ఏపీవైపు చూడక తప్పని పరిస్థితులను కల్పించింది. రాష్ట్ర విభజనతో పేరు వినా మరేం లేకుండా పోయిన విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు తన నాయకత్వ పటిమతో దశ, దిశ నిర్దేశం చేసి, స్వర్ణాంధ్ర స్వప్నాన్ని సాకారం చేయడానికి రేయింబవళ్ళు శ్రమించారు. శ్రమిస్తున్న నిజమైన అభివృద్ది కాముకుడు నారా చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ ఈ 44 ఏళ్ల ప్రస్తానంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది. అన్నిటినీ అధిగమించి తెలుగువారి జీవీతాలలో తెలుగుదేశం పార్టీ ఒక భాగంగా మారింది.


.webp)



