Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఏపీ తీరంలో బీచ్ షాక్స్.. జీవో జారీ
posted on: Jun 18, 2026 12:33PM

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో కొత్త అధ్యాయం మొదలైంది. సుదీర్ఘమైన తీరప్రాంతం ఉన్నప్పటికీ.. ఇప్పటివరకు కేవలం సాధారణ సందర్శనలకే పరిమితమైన ఆంధ్రప్రదేశ్ బీచ్ లు.. ఇక అంతర్జాతీయ స్థాయి హంగులు సంతరించుకోనున్నాయి. దేశంలోనే అత్యంత ఆదరణ పొందిన గోవా తరహా బీచ్ సంస్కృతిని ఏపీకి పరిచయం చేస్తూ..ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం బీచ్ షాక్స్ పాలసీని తీసుకువచ్చింది. బీచ్ షాక్స్ బార్ లైసెన్స్ నిబంధనలను సవరిస్తూ జీవో జారీ చేసింది. ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సారి కాకుండా.. ముందుగా పైలట్ ప్రాజెక్ట్ కింద పర్యాటక ప్రాధాన్యత ఉన్న ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్‌లో రెండు, విశాఖపట్నం తీరంలో రెండు చొప్పున మొత్తం నాలుగు బీచ్ షాక్స్ బార్ల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనివల్ల పర్యాటక రంగానికి కొత్త ఊపు రావడమే కాకుండా, స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని విశ్వసిస్తోంది.
అయితే.. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే క్రమంలో పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం కఠినమైన నిబంధనలను పొందుపరిచింది. పర్యావరణ పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ, బీచ్ షాక్స్‌ల నిర్మాణంలో ఎట్టి పరిస్థితుల్లోనూ శాశ్వత కాంక్రీట్ కట్టడాలను అనుమతించబోమని స్పష్టం చేసింది. బీచ్ షాక్ వైశాల్యం కనీసం 1,000 చదరపు అడుగుల నుండి గరిష్టంగా 1,500 చదరపు అడుగుల లోపు మాత్రమే ఉండాలని పరిమితి విధించింది. అలాగే తీరప్రాంత నియంత్రణ మండలి నిబంధనలు, స్థానిక ట్రేడ్ లైసెన్స్, ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆహార భద్రతా ప్రమాణాలు, ఫైర్ సేఫ్టీ అనుమతులు తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది.
పర్యాటక ప్రాంతాలలో శాంతిభద్రతలు, కుటుంబ సమేతంగా వచ్చే పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ బీచ్ షాక్స్‌లలో మద్యం విక్రయాలపై స్పష్టమైన, కఠినమైన ఆంక్షలు విధించారు. ఇక్కడ సాధారణ ఐఎమ్ఎఫ్ఎల్ బ్రాండ్లు లేదా విదేశీ మద్యం విక్రయాలపై పూర్తిగా నిషేధం ఉంటుంది. పర్యాటకులు ఆహ్లాదకరమైన వాతావరణంలో సేదతీరేందుకు వీలుగా కేవలం అతి తక్కువ ఆల్కహాల్ శాతం ఉండే పానీయాలైన బీర్, వైన్ అమ్మకాలకు మాత్రమే లైసెన్స్ ఇస్తారు. సమయం విషయంలోనూ కచ్చితమైన నియమాలు పెట్టారు. ఉదయం పది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు మాత్రమే ఈ మద్యం సరఫరా చేయడానికి అనుమతి ఉంటుంది.
ఈ ప్రతిష్టాత్మక బీచ్ షాక్ బార్ లైసెన్స్‌లను మొత్తం మూడేళ్ల కాలపరిమితితో ప్రభుత్వం మంజూరు చేయనుంది. దీనికి సంబంధించిన వార్షిక లైసెన్స్ రుసుమును (75 లక్షల రూపాయలు గా ప్రభుత్వం ఖరారు చేసింది. అంతేకాకుండా, ఈ లైసెన్స్ ఫీజుపై ప్రతి ఏటా 10 శాతం చొప్పున పెంపు ఉంటుందని రెవెన్యూ శాఖ స్పష్టం చేసింది. ఏపీ సుదీర్ఘ తీరప్రాంతాన్ని అంతర్జాతీయ పర్యాటక హబ్‌గా మార్చేందుకు, స్థానిక ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.






