గిన్నిస్ రికార్డు లక్ష్యంగా మహాబతుకమ్మ

ఆనాదిగా ప్రకృతికి భారతీయులకు విడదీయరాని సంబంధం ఉంది. తమకు బతుకునిస్తూ..నిత్యం వెన్నంటి నిలిచే ప్రకృతిని దైవంగా ఆరాధిస్తారు భారతీయులు. సంఘంలో క్రమశిక్షణకు, వ్యక్తుల ఆధ్మాత్మిక సరళికి ప్రకృతి మాత దోహదం చేస్తోంది. ప్రకృతి స్వరూపిణిగా అమ్మతల్లిని భావించి, వివిధ పుష్పాలతో పేర్చి బతుకమ్మగా ఆరాధిస్తారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. మహాలయ అమావాస్య నుంచి మహర్నవమి వరకు తొమ్మిది రోజుల పాటు సాగే బతుకమ్మ సందడి తెలంగాణ వ్యాప్తంగా సాంస్కృతిక సౌరభాల్ని వెదజల్లుతోంది.

 

నవరాత్రుల్లో చేసే చక్రార్చనకు ప్రతిరూపమే బతుకమ్మ ఆరాధన..! ప్రకృతిని పూజించండి..పరిరక్షించండి..ఆ ప్రకృతే మిమ్మల్ని రక్షిస్తుంది అనే సందేశాన్ని బతుకమ్మ అందిస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత బతుకమ్మకు మరింత ప్రాచుర్యం కలిగించే ప్రణాళికలకు రూపకల్పన చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. బతుకమ్మను రాష్ట్రపండుగగా ప్రకటించడంతో పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రతి జిల్లాకు కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశారు.

 

అంతేకాకుండా ట్యాంక్‌బండ్‌పై భారీగా వేడుకలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది కూడా బతుకమ్మ ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసేందుకు తెలంగాణ పర్యాటక శాఖ కృషి చేస్తోంది. సీఎం కేసీఆర్ దిశానిర్దేశం ప్రకారం ఇవాళ మహాబతుకమ్మ ఉత్సవాన్ని నిర్వహిస్తోంది. సుమారు 35 వేల నుంచి 40 వేల మంది ఆడబిడ్డలతో చరిత్రలో ఎక్కడా నిర్వహించని విధంగా ఉత్సవాన్ని నిర్వహించి, గిన్నిస్ బుక్‌ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాలని తెలంగాణ టూరిజం ప్రయత్నిస్తోంది. గతేడాది అక్టోబర్ 12న తెలంగాణ బతుకమ్మ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు పోటీకి అర్హత సాధించింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య మహిళలు బతుకమ్మలను పేర్చుకొని బస్సుల్లో స్టేడియానికి తరలివస్తారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కవితతో పాటు పలువురు మహిళా నేతలు బతుకమ్మ ఆడనున్నారు.

 

ఆరో రోజు బతుకమ్మ వేడుకలు: బతుకమ్మ వేడుకల్లో ఆరో రోజు అమ్మవారిని అలిగిన బతుకమ్మగా పూజించారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి.

 

రవీంద్రభారతి: రవీంద్ర భారతిలో తెలంగాణ సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేసిన ఉత్సవాల్లో భాగంగా నిన్న ప్రదర్శించిన మహిషాసుర మర్థిని నృత్య రూపకం ఆకట్టుకుంది. అలాగే భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న బతుకమ్మ ఫిల్మోత్సవంలో ఫిదా సినిమాను ప్రదర్శించారు. ఈ సందర్భంగా భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ చేతుల మీదుగా ఫిదా చిత్ర యూనిట్‌ను ఘనంగా సత్కరించారు. అనంతరం యువ దర్శకులు అడిగిన ప్రశ్నలకు శేఖర్ కమ్ముల సమాధానాలిచ్చారు.

 

ఏడో రోజు బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా రవీంద్ర భారతి ప్రివ్యూ థియేటర్‌లో జరుగుతున్న బతుకమ్మ ఫిల్మోత్సవంలో ఇవాళ ప్రభాకర్ జైనీ దర్శకత్వంలో వచ్చిన "క్యాంపస్ అంపసెయ్యా" సినిమాను ప్రదర్శించనున్నారు.