పోచారం బండ కట్టుకుని బాయిలో దూకాలి...కేటీఆర్‌ షాకింగ్ కామెంట్స్‌

posted on: Feb 7, 2026 7:45PM

 

బాన్సువాడ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హాట్‌ కామెంట్స్‌తో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించారు. సీఎం రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.“రేవంత్‌ రెడ్డి ఏనాటికీ కాంగ్రెస్‌ మనిషి కాలేడు. ఆయన లోపల ఉన్నది బీజేపీ ఆలోచనలే. కాంగ్రెస్‌ నేత కాదు… బడే భాయ్‌ తమ్ముడు” అంటూ కేటీఆర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని మైనారిటీలు, మత రాజకీయాలను వ్యతిరేకించే ప్రతి ఒక్కరూ రేవంత్‌ రెడ్డి కప్పుకున్న బీజేపీ ముసుగును తొలగించి చూడాలని, ఆయనలో ఉన్న అసలైన బీజేపీ నాయకుడిని గుర్తించాలని పిలుపునిచ్చారు.

“అధికారంలో ఉన్నాం కాబట్టి మాకు ఓటు వేయాలి అనేది కాంగ్రెస్‌ వాదన అర్థరహితం. గత రెండేళ్లలో వారు ఏం చేశారు? ప్రజలకు ఏమి ఇచ్చారు? అన్నది కాంగ్రెస్‌ నేతలు చెప్పాలి” అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణాలను గతంలో మాదిరిగానే మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలయ్యాయని భావించే వాళ్లే ఆ పార్టీకి ఓటు వేయాలని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

కేసీఆర్‌ హయాంలో తెలంగాణలో స్వర్ణయుగం నడిచిందని కేటీఆర్‌ అన్నారు. పేదల కోసం కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. అడ్డగోలు హామీలతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగిన ఈ ప్రచార కార్యక్రమంలో ముందుగా కొయ్యగుట్టలో అమరవీరుల స్తూపం వద్ద కేటీఆర్‌ నివాళులర్పించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌తో కలిసి కొయ్యగుట్ట నుంచి అంబేద్కర్‌ చౌరస్తా వరకు భారీ బైక్‌ ర్యాలీలో పాల్గొన్నారు. అంబేద్కర్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్‌ మీటింగ్‌లో ప్రసంగించారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డిపై కేటీఆర్‌ నిప్పులు చెరిగారు. “బాన్సువాడ ప్రజలు పోచారంను నమ్మి గెలిపిస్తే ఆయన ఏం చేశాడు?” అని ప్రశ్నించారు. గతంలో సీఎం రేవంత్‌ రెడ్డి, పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, ఆయన తనయులు దోచుకుంటున్నారని అన్న మాటలను గుర్తుచేశారు. “ఒక ఆంబోతు, రెండు దున్నపోతులు” అంటూ విమర్శించలేదా? అని ప్రశ్నిస్తూ, అలాంటి మాటలు చెప్పిన రేవంత్‌ రెడ్డికే ఇప్పుడు పోచారం వెళ్లి చేరాడని ఎద్దేవా చేశారు.

ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి గతంలో పోచారంపై చేసిన విమర్శల ఆడియోను ఫోన్‌లో ప్రజలకు వినిపించారు. “పోచారం బండ కట్టుకుని బాయిలో దూకాలె” అంటూ రేవంత్‌ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. కాంగ్రెస్‌లోకి ఎందుకు వెళ్లారో పోచారం ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. బాన్సువాడ ప్రజలు గల్లా పట్టుకుని ఆయనను ప్రశ్నించాలని సూచించారు. “పోచారం బాన్సువాడ సిగ్గు తీసిండు” అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...