పరారీలో బండి భగీరథ్?!

posted on: May 12, 2026 10:09AM

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన కేసు సంచలనం రేపుతోంది. మైనర్  బాలికపై వేధింపులకు సంబంధించి నమోదైన పోక్సో కేసులో భగీరథ్ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే  గత మూడు రోజులుగా ఆయన ఎవరికీ అందుబాటులో లేకుండా పోవడంతో ఆయన పరారీలో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. బండి భగీరథ్  ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లడంతో పోలీసులు ఆయన కోసం గాలింపు చేపట్టారు. ఇక పోతే ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవడం.. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే..  క్రైమ్, శాంతి భద్రతల విషయంలో ఎవరికీ మినహాయింపు ఉండకూడదని స్పస్టం చేయడమే కాకుండా, ఈ కేసులో ఇంత వరకూ చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ డీజీపీ సీవీ ఆనంద్ ను నిలదీయడంతో .. పోలీసులు కూడా  బండి భగీరథ్ పరారీ విషయాన్ని సీరియస్ గా తీసుకుని ఆయన కోసం  ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.  బండి భగీరథ్ ఆయన విదేశాలకు వెళ్లే అవకాశం ఉందన్న అనుమానంతో  విమానాశ్రయాలను కూడా అప్రమత్తం చేశారు. మొత్తం మీద బండి భగీరథ్ ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారనేది మిస్టరీగా ఉంది. 

ఈ కేసులో రాజకీయ ఒత్తిళ్లు పెరిగినప్పటికీ, సామాజిక న్యాయం,  చట్టం ముందు అందరూ సమానమేనన్న సందేశాన్ని ప్రజల్లోకి పంపేందుకు  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఎటువంటి ఒత్తిళ్లకూ వెరవకుండా ముందుకు సాగాలని పోలీసులకు విస్పష్ట ఆదేశాలిచ్చారు.  ఒకవేళ ఈ విషయంలో ప్రభుత్వం మెతక వైఖరి అవలంబిస్తే ప్రజా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందన్న భావనతో  ఎటువంటి జాప్యం లేకుండా నిందితుడిని చట్టం ముందు నిలబెట్టాలని  రేవంత్ సర్కార్ కృతనిశ్చయంతో ఉంది.

మరోవైపు ఈ ఘటనపై బీజేపీ  అగ్రనాయకత్వం ఆచితూచి స్పందిస్తోంది. ఇది వ్యక్తిగతమైన విషయమని, పార్టీకీ దీనికీ ఎటువంటి సంబంధం లేదని  బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెబుతూనే, విచారణ పారదర్శకంగా జరగాలని డిమాండ్ చేస్తున్నాయి.  బండి భగీరథ్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసిన నేపథ్యంలో.. ఏ క్షణంలోనైనా ఆయన  అరెస్టు అవకాశాలున్నాయని అంటున్నారు.   

google-ad-img
    Related Sigment News
    • Loading...