అరటి ధరలకు రెక్కలు - రైతులు ఫుల్ హ్యాపీ
posted on: Feb 20, 2026 1:41PM
.webp)
అరటి ధరలకు అమాంతం రెక్కలొచ్చాయి. పాతాళానికి పడిపోయిన అరటి ధరలు ఇప్పుడు ఆకాశాన్నంటుతున్నాయి. క్వింటా ధర రూ.25 వేలకు చేరడంతో అన్నదాతలు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అరటి సాగు ఎక్కువగా ఉంటే అనంతపురం జిల్లాలో 7,250 ఎకరాల్లో అరటి సాగుచేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. పంట బాగా పండితే జిల్లా వ్యాప్తంగా 1,88,500 టన్నులు దిగుబడి వచ్చే అవకాశం ఉంది.
ధరలు ఇలాగే కొనసాగితే జిల్లా రైతులకు రూ.377 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అరటి క్వింటా ధర నెలన్నర క్రితం వరకు రూ.2 వేలు పలికింది. దీంతో అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆ ధరకు విక్రయిస్తే పంట కోత కూలీల ఖర్చులు కూడా రావని రైతులను గెలలను చెట్లపైనే వదిలేశారు. ఇంకొందరు వాటిని కోసి పశువులకు మేతగా వేశారు. ఇలా పెట్టుబడులు మొత్తంగా కోల్పోయి జిల్లాలో కోట్ల రూపాయల నష్టాలను మూటగట్టుకున్నారు.
అప్పట్లో అరటి రైతు కష్టాలపై తీవ్ర చర్చ సాగింది. పాతాళానికి పడిపోయిన అరటి ధరలు చిన్నగా పెరుగుతూ వచ్చాయి. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో అరటికి డిమాండ్ పెరగడంతో రోజురోజుకీ ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం టన్ను రూ.25 వేల వరకు పలుకుతోంది. ఎకరానికి రూ.లక్ష వరకు పెట్టుబడులు పెడుతున్నారు. సాగు ఖర్చులు పోను రూ.లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పండే అరటిని ఢిల్లీ, కోల్‌కతా, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు.






