రక్తసిక్తమవుతున్న బలూచిస్థాన్...40 గంటల్లో 200 మంది మృతి

posted on: Feb 2, 2026 8:06PM

 

పాకిస్థాన్‌లోని బలూస్థాన్ నైరుతి ప్రావిన్స్ మరోసారి రణరంగంగా మారింది. బలూచిస్థాన్ గత 40 గంటలుగా భీకర పోరాటంతో అట్టుడుకుతోంది. వేర్పాటువాద గ్రూపులు సృష్టించిన విధ్వంసం, దానికి ప్రతిగా భద్రతా దళాలు చేపట్టిన భారీ ఆపరేషన్‌లో మొత్తం 145 మంది తీవ్రవాదులు హతమయ్యారు. ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో చోటుచేసుకున్న అత్యంత ఘోరమైన హింసాకాండగా ఇది రికార్డు సృష్టించగా.. ఈ దాడుల్లో తీవ్రవాదులే కాకుండా 17 మంది భద్రతా సిబ్బంది, 31 మంది సామాన్య పౌరులు కూడా ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రావిన్స్‌లోని వివిధ జిల్లాల్లో తీవ్రవాదులు ఏకకాలంలో దాడులు జరగడంతో సైన్యం తక్షణమే రంగంలోకి దిగి ఎదురుదాడి ప్రారంభించింది.

బలూచిస్థాన్ ప్రాంతంలో దశాబ్దాలుగా అసంతృప్తి సెగలు  రగులుతూనే ఉన్నాయి. ఈ ప్రాంతంలో లభించే గ్యాస్, ఖనిజ సంపదలో తమకు సరైన వాటా దక్కడం లేదని బలోచి జాతీయవాద గ్రూపులు ఆరోపిస్తున్నాయి. కేంద్రం తమ వనరులను వాడుకుంటూ.. రాష్ట్రాభివృద్ధికి ఏమాత్రం సాయం చేయడం లేదని చెబుతున్నాయి. అందుకే స్థానిక వనరులపై తమకే నియంత్రణ ఉండాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారు పాక్ ప్రభుత్వానికి, సైన్యానికి వ్యతిరేకంగా ఆయుధాలు పట్టారు.

తాజాగా జరిగిన దాడులకు కూడా బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ బాధ్యత వహించింది. ముఖ్యంగా పాక్ దళాలపై దాడి చేసింది తమ విభాగానికి చెందిన ఇద్దరు మహిళా కమాండర్లేనని పేర్కొంది. అందులో ఒకరైన 24 ఏళ్ల ఆసిఫా మెంగల్ దాడిలో పాక్ సిబ్బంది సహా 50 చనిపోయారని వివరించింది. అలాగే మరో ఆత్మాహుతి బాంబర్ దాడిలోనూ అనేక ప్రాణాలు కోల్పోయినట్లు వివరించింది. బలూచిస్థాన్‌లో జరిగిన ఈ దాడులను ఇస్లామాబాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం తీవ్రంగా ఖండించింది.  ఈ దాడుల వెనుక భారత్ హస్తం ఉందని పాక్ సైనిక అధికారులు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా తోసిపుచ్చింది. పాక్ చేస్తున్న విమర్శలు నిరాధారమైనవి అని, తమ దేశంలోని అంతర్గత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి ప్రచారాలు చేస్తోందని భారత్ స్పష్టం చేసింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...