ఇలాంటి విమర్శలు తగునా?



తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌కి చెందిన మీడియా తెలంగాణకు చెందిన మీడియాలా కాకుండా టీఆర్ఎస్ పార్టీకి చెందిన సొంత మీడియాలా వ్యవహరిస్తోందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ సొంత మీడియా విషయంలో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని అయినా సదరు మీడియా, ఆ మీడియాకి నాయకత్వం వహిస్తున్నవారు తమ వైఖరిని మార్చుకుంటే బాగుండేది. తెలంగాణ అభివృద్ధి కోసం అన్నట్టు కాకుండా టీఆర్ఎస్ అభివృద్ధి కోసమే పనిచేస్తున్నట్టుగా వుందన్న విమర్శలు ఇటీవలి కాలంలో బాగా వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో తాజాగా సదరు మీడియాలో వచ్చిన ఒక విమర్శ లాంటి వార్త రాజకీయ పరిశీలకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇలాంటి విమర్శలు తగునా అని అందరూ ముక్కు వేలేసుకునేలా సదరు కథనాలు వున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే హామీ విభజన బిల్లు ఆమోదం సమయంలో లభించింది. అయితే ఆ హామీ ఇప్పుడు నీరుగారిపోయింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం నాయకులు కొందరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ ప్రధానికి ఒక విజ్ఞాపన పంపించారు. దానిమీద తెలంగాణ రాష్ట్రానికి చెందిన టీడీపీ ఎంపీ మల్లారెడ్డి, పలువురు నాయకులు సంతకాలు చేశారు. ఇలా తెలంగాణకు చెందిన ఎంపీ, నాయకులు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ప్రధానిని కోరడం అన్యాయం, దారుణం, తెలంగాణకు ద్రోహం చేయడం అన్నట్టుగా కథనాలు సదరు మీడియాలో రావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పొరుగు రాష్ట్రం బాగుండాలని కోరుకుంటూ సంతకాలు చేసిన నాయకుల ఔదార్యం చాలా గొప్పది. ఈ విషయం నుంచి కూడా రాజకీయ లబ్ధి పొందాలన్న కోణంలో కథనాలు రాయడం మంచిది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా్యి. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా వస్తే తెలంగాణకు వచ్చే నష్టమేమిటన్న ప్రశ్నకు సమాధానం చెప్పేవారెవరూ లేరు. ఇప్పటికే ఇరు ప్రాంతాల ప్రజల మధ్య అంతరం బాగా పెరిగింది. అది తీవ్రమైన విద్వేషంగా మారకుండా చూసుకోవాల్సిన అవసరం వుంది. రెండు రాష్ట్రాలూ బాగుండాలి. సదరు మీడియా ఈ విషయాన్ని గ్రహిస్తే అందరికీ మంచింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu