Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అంగడీలో ఆడ శిశువును అమ్మేసిన కసాయి తల్లిదండ్రులు
posted on: May 14, 2026 9:06AM

మెదక్ జిల్లా మరోసారి శిశు విక్రయ ఘటనతో కలవరపాటుకు గురైంది. ఇటీవలే నవజాత శిశువును నర్సులు అమ్మిన ఘటన ప్రజలను షాక్‌కు గురిచేయగా… ఇప్పుడు మరో పసికందును డబ్బుల కోసం విక్రయించిన సంఘటన వెలుగులోకి రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తల్లి ఒడిలో పెరగాల్సిన పాపకు పుట్టిన కొద్ది రోజులకే ధర కట్టడం సమాజాన్ని కలచివేస్తోంది.
మేడ్చల్ జిల్లాలోని కొల్చారం మండలం పోతారెడ్డిపల్లి తండాకు చెందిన శిరీష(25)కు మార్చి 27న నాలుగో కాన్పులో ఆడశిశువు జన్మించింది. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉండటంతో ఆ దంపతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జీవనోపాధి కోసం పోరాడుతున్న వారు చివరకు కన్న కూతురినే అమ్మేయాలనే దారుణ నిర్ణయం తీసుకున్నారు.
ఈ వ్యవహారంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన శారద అనే మహిళ మధ్యవర్తిగా వ్యవహరించింది. ఆమె సిద్దిపేట జిల్లా ములుగు మండలం అల్లినగర్‌కు చెందిన కలమ్మ, లింగయ్య దంపతులతో మాట్లాడి ఒప్పందం కుదిర్చింది. ఏప్రిల్ 1న శిశువును మూడు లక్షల రూపాయలకు విక్రయించినట్లు సమాచారం. అయితే అందులో అసలు తల్లిదండ్రుల చేతికి చేరింది కేవలం రూ.40 వేలే కాగా… మిగతా మొత్తం మధ్యవర్తి తీసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
కొన్ని రోజుల తర్వాత ఐసీడీఎస్ అధికారులు శిరీష ఇంటికి వెళ్లి శిశువు గురించి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. “పాప ఎక్కడ?” అనే ప్రశ్నకు తల్లిదండ్రులు తడబడటంతో అధికారులకు అనుమానం వచ్చింది. లోతుగా విచారించగా శిశు విక్రయం జరిగినట్లు తేలింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తల్లిదండ్రులు, మధ్యవర్తి సహా మొత్తం పది మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
కేవలం రెండు నెలల వ్యవధిలోనే మెదక్ జిల్లాలో ఇది మూడో శిశు విక్రయ ఘటన కావడం ఆందోళన కలిగిస్తోంది. పేదరికం ఎంతటి దారుణ నిర్ణయాలకు దారితీస్తుందో… పసికందులకు కూడా ధర కట్టే పరిస్థితులు ఇంకా సమాజంలో ఉన్నాయనే విషాద వాస్తవాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.





