టికెట్ రూ.150... స్నాక్స్ రూ.250... థియేటర్లలో నిలువు దోపిడీ
posted on Apr 27, 2017 11:07AM

బాహుబలి-2 రిలీజ్‌కు ముందే ప్రేక్షకులకు చుక్కలు చూపిస్తోంది. బాహుబలి-1 సస్పెన్స్ తెలుసుకోవాలంటే బాహుబలి-2 చూడాల్సిందేనని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు మైండ్ బ్లాంక్ అవుతోంది. అభిమానుల క్రేజ్‌ను మల్టీఫ్లెక్స్‌లు క్యాష్ చేసుకుంటున్నాయి . సరదాగా సినిమాకు వెళ్దామనుకుంటే... ప్రేక్షకుల జేబుకు కన్నమేస్తున్నాయి. టికెట్ బుక్ చేసుకుందామనుకున్న ప్రేక్షకులకు థియేటర్లు దడపుట్టిస్తున్నాయి. టికెట్ బుక్ చేసుకోవాలంటే కచ్చితంగా పాప్ కార్న్, సమోసా, కూల్ డ్రింక్ కొనాలంటూ షరతులతో హడలుగొడుతున్నారు. దాంతో 150 రూపాయలు పెట్టి సిన్మా చూడాలనుకుంటే.... స్నాక్స్ కోసం మరో 250 రూపాయలు ఖర్చు చేయాలి. అంటే ఒక్క టికెట్‌కు 400 రూపాయలు పెట్టాల్సిందే.
బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలుసుకోవాలంటే మొదటి రోజు మొదటి ఆట చూడాల్సిందే. ఆ తర్వాత సినిమా చూసినా, సస్పెన్స్ తెలిసిపోయి మజా ఉండదు. అందుకే ఎంత రేటు పెట్టయినా సరే టికెట్ కొని సినిమా చూడాలనుకుంటున్నారు ప్రేక్షకులు, ఈ క్రేజ్‌నే క్యాష్ చేసుకుంటున్నారు థియేటర్ల యాజమాన్యాలు. బాహుబలి-2పై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజును క్యాష్ చేసుకోవడమే కాకుండా... దారుణంగా దోపిడీకి పాల్పడుతున్నాయి థియేటర్ల యాజమాన్యాలు. ప్రేక్షకుల జేబులు గుల్ల చేయడమే లక్ష్యంగా కాంబో ఆఫర్లు, ఎంట్రీ పాస్‌ల పేరిట సినీ అభిమానులకు చుక్కలు చూపిస్తున్నారు. ప్రేక్షకులకు ఇష్టమున్నా లేకపోయినా కూల్ డ్రింక్స్, పాప్ కార్న్, తినుబండారాలను కచ్చితంగా కొనుగోలు చేసేలా కాంబో ఆఫర్లు పెట్టారు. టికెట్‌తోపాటే కాంబో ఆఫర్లు మిక్స్ చేసి అమ్ముతున్నారు. దాంతో 150 రూపాయల టికెట్‌ని మూడు నాలుగు వందల వరకు అమ్ముతున్నారు.
మరోవైపు ఏపీలో అధికారికంగానే బాహుబలి టికెట్లు భారీగా పెంచేశారు. మల్లీఫ్లెక్సుల్లో 150 రూపాయల టికెట్ 200కి.... 200 రూపాయల టికెట్‌ను 250కి విక్రయించనున్నారు. ఇక సాధారణ థియేటర్లలో 70 రూపాయల టికెట్ 100కి.... 90 రూపాయల టికెట్ 150కి.... 150 రూపాయల టికెట్ 200కి అమ్మనున్నారు. అయితే పెంచిన టికెట్ల ధరలు.... మొదటి వారంరోజులు మాత్రమే అమల్లోకి ఉండనున్నాయి.
చివరిగా చెప్పేదేమంటే కట్టప్ప.... బాహుబలిని ఎందుకు చంపాడో చూద్దామని థియేటర్‌కి వెళ్తే ...నిలువు దోపిడీ ఖాయం. సినిమా చూడాలంటే... ఇష్టమున్నా లేకున్నా ఫుడ్ ఐటెమ్స్ కొనాల్సిందే.