అజ్జూభాయ్ తిక్క కుదిరింది!

 

 

 

క్రికెటర్‌గా గ్రౌండ్‌లో సిక్సర్స్ కొట్టి, గ్రౌండ్ బయట మ్యాచ్ ఫిక్సర్‌గా నిలిచిన మహ్మద్ అజారుద్దీన్ ఆ తర్వాత రాజకీయ రంగానికి షిఫ్టయ్యాడు. కళంకితులకు సీట్లు ఇవ్వడంలో ముందుండే కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్‌ని సాదరంగా ఆహ్వానించి యు.పి.లోని మురాదాబాద్ ఎంపీ సీటు ఇచ్చింది. టైం బాగుండి అజార్ అక్కడ గెలిచాడు.

 

ఎంపీగా అజారుద్దీన్ మురాదాబాద్ నియోజకవర్గాన్ని ఉద్ధరించిందేమీ లేదు. అజారుద్దీన్ పేరు చెబితేనే మురాదాబాద్ జనం ముఖాలు తిప్పుకుంటున్నారు. తన నియోజకవర్గానికి అజార్ చేసిన సేవ ఏమీ లేకపోయినా, సోనియమ్మ సేవలో మాత్రం తరించిపోయాడు. సోనియాగాంధీ ఆదేశాల మేరకు మొన్నామధ్య పార్లమెంట్‌లో సీమాంధ్ర ఎంపీలను చితకబాదే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేశాడు. సొంత రాష్ట్రం ఎంపీలని కూడా చూడకుండా రౌడీయిజం ప్రదర్శించిన అజారుద్దీన్‌కి ఇప్పుడు తగిన శాస్తి జరిగింది.



ఈసారి ఎన్నికలలో అజార్‌కి కాంగ్రెస్ అధిష్ఠానం టిక్కెట్ ఇవ్వకుండా మొండిచెయ్యి చూపడంతో బాగా ముదిరిపోయిన ఆయన తిక్క కుదిరింది. పార్టీ కోసం పార్లమెంట్‌లో రౌడీయిజం చేశాడన్న అభిమానం కూడా లేకుండా అజార్‌కి టిక్కెట్ ఇవ్వనంది. మురాదాబాద్ టిక్కెట్‌ని నూర్‌భాన్ అనే ముస్లిం మహిళకు కేటాయించింది. దాంతో లబోదిబోమన్న అజారుద్దీన్ కాంగ్రెస్ అధిష్ఠానం కాళ్ళావేళ్ళా పడ్డా ఉపయోగం లేకుండా పోయింది. భవిష్యత్తులో మరో నియోజకవర్గం నుంచి అయినా టిక్కెట్ ఇస్తారో లేదో అన్న గ్యారంటీ లేక అజారుద్దీన్ అయోమయ పరిస్థితిలో వున్నాడు. అజారుద్దీన్‌కి సీమాంధ్రుల శాపనార్థాలే తగిలి వుంటాయి.