అయోధ్య రాముడి నిధుల చోరీ కేసు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

posted on: Jun 29, 2026 2:05PM

అయోధ్య రామమందిర నిర్మాణానికి దేశవిదేశాల నుంచి భక్తులు సమర్పించిన విరాళాలు, చందాల దుర్వినియోగం వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ నిధుల చోరీపై నిష్పాక్షికంగా, అత్యంత వేగంగా,  దర్యాప్తు జరపాలని కోరుతూ దేశ సర్వోన్నత న్యాయస్థానంలో  పిటిషన్ దాఖలైంది.  దేశవ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న వ్యవహారం కావడంతో, ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని పిటిషనర్లు సుప్రీం కోర్టును కోరారు. అయితే అత్యవసర విచారణకు నిరాకరిస్తూ సుప్రీం కోర్టు సోమవారం.. వెకేషన్ తరువాత ఈ పిటిషన్ ను లిస్ట్ చేస్తామని స్పష్టం చేసింది.  జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్ షీల్ నాగులతో కూడిన సుప్రీం వెకేషన్  ధర్మాసనం  ఈ పిటిషన్‌ను ప్రస్తుత వేసవి సెలవుల  అనంతరం, కోర్టు పునఃప్రారంభమయ్యాక సాధారణ జాబితాలో చేర్చి విచారిస్తామని   స్పష్టం చేసింది. 

ఈ సందర్భంగా   వెకేషన్ బెంచ్   చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు న్యాయ,  రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.  ఈ కేసును ఇప్పుడే, ఇంత అత్యవసరంగా విచారించకపోతే ఆకాశమేమీ విరిగిపడదు కదా.. ఇందులో అంత అత్యవసరమేముంది  అంటూ న్యాయమూర్తులు  వ్యాఖ్యానించారు. కోర్టులు సెలవుల్లో ఉన్న సమయంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన, ప్రాణాలతో లేదా అత్యవసర రాజ్యాంగ సంక్షోభాలతో ముడిపడిన కేసులనే విచారిస్తామని.. ఈ నిధుల దుర్వినియోగం కేసు దర్యాప్తును సెలవుల తర్వాత కూడా పరిశీలించవచ్చని బెంచ్ స్పష్టం చేసింది.  

మరోవైపు, ఈ  కేసులో ఇప్పటికే  దర్యాప్తు సాగుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఈ నిధుల గోల్ మాల్ కుంభకోణంపై  విచారణ జరుపుతోంది. ఎవరెవరు ఈ నిధుల మళ్లింపునకు పాల్పడ్డారు, ఎక్కడికి ఈ చందాలు చేరాయి అనే  కోణంలో సిట్  ఆరా తీస్తోంది. ఈ దర్యాప్తు ఒకవైపు కొనసాగుతుండగానే..  అయోధ్య బార్ అసోసియేషన్ కూడా ఈ కేసులో రాముడి నిధులను దొంగిలించిన నిందితుల తరఫున అయోధ్యలోని ఏ   లాయర్ కూడా వకాలత్ పుచ్చుకోకూడదనీ.. వారి తరఫున వాదించకూడదని  తీర్మానించింది. ఒకవేళ ఈ నిబంధనను ఎవరైనా లాయర్ ధిక్కరిస్తే, వారికి  రూ. 5 లక్షల భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది.   

google-ad-img
    Related Sigment News
    • Loading...