మరణించిన 15 ఏళ్ల తర్వాత ఆయేషా మీరా అంత్యక్రియలు

posted on: Feb 21, 2026 10:14AM

కోర్టు తీర్పుతో ఆయేషా తల్లిదండ్రులకు ఊరట 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్య కేసులో తాజాగా సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అయేషా మీరా హత్య కేసులో శాస్త్రీయ పరీక్షల నిమిత్తం గతంలో సేకరించిన ఆమె శరీర అవశేషాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. ఈ నిర్ణయంతో దాదాపు పదిహేనేళ్లకు పైగా న్యాయం కోసం పోరాడుతున్న ఆయేషా తల్లిదండ్రులకు  తమ కుమార్తెకు అంత్యక్రియలు నిర్వహించుకునే అవకాశం లభించింది. ఈ నెల   27న గుంటూరు జిల్లా తెనాలిలో ముస్లిం మతాచారాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఈ అంత్యక్రియల ప్రక్రియ సజావుగా సాగేలా అవసరమైన భద్రతను, వసతులను కల్పించాలని ప్రభుత్వాన్ని, పోలీసు యంత్రాంగాన్ని కోర్టు ఆదేశించింది. పారదర్శకత కోసం ఈ మొత్తం ప్రక్రియను ప్రభుత్వ అధికారుల సమక్షంలో వీడియో రికార్డింగ్ చేయాలని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది.
2007లో విజయవాడ శివార్లలోని ఒక హాస్టల్‌లో బీఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. మొదట స్థానిక పోలీసులు విచారణ జరిపారు. అనంతరం బాధితురాలి తల్లిదండ్రుల పోరాటంతో కేసు సీబీఐకి బదిలీ అయ్యింది. ఈ విచారణలో భాగంగా కొన్ని సంవత్సరాల క్రితం ఆమె మృతదేహానికి రీ-పోస్టుమార్టం నిర్వహించి, కీలక ఆధారాల కోసం అవశేషాలను సేకరించారు. తమ కుమార్తె శరీర అవశేషాల కోసం గత కొంతకాలంగా అయేషా తల్లిదండ్రులు శంషాద్ బేగం, సయ్యద్ ఇక్బాల్ బాషా.. న్యాయపోరాటం చేస్తున్నారు. కోర్టు తాజా ఆదేశాలపై ఆమె స్పందిస్తూ, కనీసం ఇన్నేళ్లకైనా తన కుమార్తెకు సాంప్రదాయబద్ధంగా వీడ్కోలు పలికే అవకాశం దక్కిందని ఆవేదన వ్యక్తం చేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...