అవనిగడ్డ టీడీపీ అభ్యర్థి మారనున్నారా?
posted on Apr 16, 2014 1:15PM
.jpg)
కృష్ణా జిల్లా అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి, కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి జంప్ అయిన మండలి బుద్ధ ప్రసాద్ పేరును ప్రకటించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు పొరపాటు చేశానన్న అతర్మథనంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏ క్షణాన మండలి బుద్ధ ప్రసాద్‌ని అవనిగడ్డ అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారోగానీ, ఆ క్షణం నుంచే నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తల నుంచి తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
ఇంతకాలం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన తెలుగుదేశం నాయకులని కాదని, పదవి కోసం పార్టీ మారిన బుద్ధ ప్రసాద్‌కి టిక్కెట్ ప్రకటించడాన్ని స్థానిక టీడీపీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. టిక్కెట్ ఇచ్చిన తర్వాత నియోజకవర్గ పరిస్థితులను పరిశీలించిన చంద్రబాబు అక్కడ బుద్ధ ప్రసాద్‌కి గెలిచే సీన్ లేదని అర్థం కావడంతో నాలుక్కరుచుకుని, ఇప్పుడేం చేయాలా అన్న అంతర్మథనంలో పడినట్టు తెలుస్తోంది.
నియోజవర్గం సమస్యల పరిష్కారలో ఎప్పుడూ చొరవ చూపని మండలికి నియోజకవర్గం ప్రజల్లో వ్యతిరేకత వుంది. అలాగే స్థానిక తెలుగుదేశం నాయకులు మండలికి వ్యతిరేకంగా పనిచేస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో మండలి ఓటమి ఖాయమని తేలిపోయింది. దీంతో అవనిగడ్డ నుంచి మండలిని తప్పించే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ టిక్కెట్‌ని పార్టీకి ఎప్పటి నుంచో సేవ చేస్తున్న స్థానిక తెలుగుదేశం నాయకుడికే ఇవ్వాలని బాబు భావిస్తున్నట్టు సమాచారం.