అవనిగడ్డపై చంద్రబాబు అంతర్మథనం
posted on Apr 21, 2014 2:28PM
.jpg)
కృష్ణాజిల్లా అవనిగడ్డ అసెంబ్లీ టిక్కెట్‌ని కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి జంప్ అయిన మండలి బుద్ధ ప్రసాద్‌కి కేటాయించిన విషయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు అంతర్మథనం చెందుతున్నట్టు తెలుస్తోంది. అవనిగడ్డ నియోజకవర్గంలో ఆల్రెడీ ఓడిపోయిన బుద్ధ ప్రసాద్‌కి టిక్కెట్ ఇవ్వొద్దని అక్కడి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు మొత్తుకున్నారు. అయినప్పటికీ వినకుండా చంద్రబాబు నాయుడు మండలికి టిక్కెట్ ఇచ్చారు. అది స్థానిక తెలుగుదేశం నాయకులలో, తెలుగుదేశం పార్టీకి ఎంతో సేవ చేసిన వారిలో ఆవేదన కలిగించింది. టీడీపీ కార్యకర్తల ఆవేదనని మొదట్లో పట్టించుకోని చంద్రబాబు ఆ తర్వాత జరిపిన ఎంక్వయిరీలో అవనిగడ్డ స్థానం నుంచి మండలికి గెలిచే సీన్ లేదని తెలిసి నాలుక్కరుచుకున్నట్టు సమాచారం. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవచ్చు. కానీ మండలికి టిక్కెట్ ఇచ్చిన విషయంలో ఏం చేయాలో అర్థంకాక చంద్రబాబు అయోమయంలో పడిపోయినట్టు సమాచారం. దానికితోడు అవనిగడ్డ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం రెబల్ అభ్యర్థిగా రంగంలో నిలిచిన రవిశంకర్ కంఠంనేని ఇప్పుడు స్థానికంగా మండలి బుద్ధ ప్రసాద్‌కంటే బలమైన అభ్యర్థిగా వుండటంతో చంద్రబాబుకు కృష్ణాజిల్లాలో పరువు పోయేట్టుందే అని దిగులు పట్టుకుందని సమాచారం. తెలుగుదేశం పార్టీకి ఎంతో సేవ చేయడంతోపాటు, స్థానిక ప్రజల సమస్యల మీద పూర్తి అవగాహన, ఆ సమస్యల పరిష్కారం విషయం అవగాహన వున్న వ్యక్తిగా రవిశంకర్ కంఠంనేనికి అవనిగడ్డ నియోజకవర్గంలో మంచి గుర్తింపు వుంది. వ్యక్తిగతంగా కూడా ఆయన చేసిన సేవా కార్యక్రమాలు స్థానిక ప్రజల్లో ఆయన మీద అభిమానం వుంది. ఇప్పుడు అవనిగడ్డలో తెలుగుదేశం, కాంగ్రెస్, వైకాపా అభ్యర్థుల కంటే టీడీపీ రెబల్‌గా బరిలో నిలిచిన రవిశంకర్ కంఠంనేనికే ఎక్కువ బలం వుందని స్పష్టంకావడంతో తెలుగుదేశంతో పాటు మిగతా రెండు పార్టీలు ఈ స్థానంలో గెలుపు మీద ఆశలు వదిలేసుకుని చేతులెత్తేసినట్టు తెలుస్తోంది.