అవనిగడ్డలో సైకిల్‌కి పంచరే!
posted on: Apr 15, 2014 12:24PM
.jpg)
నిన్న మొన్నటి వరకు అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మంచి గ్రిప్ వుండేది. అనేకమంది తెలుగుదేశం నాయకులు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బలమైన పునాది ఏర్పరిచారు. ఈసారి ఎన్నికలలో ఇక్కడ నుంచి తెలుగుదేశం విజయం ఖాయమయ్యేలా నియోజకవర్గంలో టీడీపీని తీర్చిదిద్దారు. ఈ ఎన్నికల సందర్భంగా అనేక తప్పటడుగులు వేసిన చంద్రబాబు నాయుడు అవనిగడ్డ నియోజకవర్గంలో కూడా భారీ తప్పటడుగు వేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నిన్నగాక మొన్న టీడీపీలోకి దూకిన మండలి బుద్ధప్రసాద్‌కి అవనిగడ్డ టిక్కెట్‌ని ప్రకటించారు. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం అక్కడి తెలుగుదేశం కార్యకర్తల్లో, స్థానిక ప్రజల్లో తీవ్ర నిరసనను ఎదుర్కొంటోంది. గత ఎన్నికలలో ఓడిపోయిన బుద్ధ ప్రసాద్ నామినేషన్ పదవులు వెలగబెడుతూ టైమ్‌పాస్ చేశారే తప్ప నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారం కోసం ఎంతమాత్రం ప్రయత్నించలేదని స్థానిక ప్రజలు అంటున్నారు. స్థానికంగా ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన బుద్ధప్రసాద్‌కి టిక్కెట్ కేటాయించడం తెలుగుదేశం ఓటమిని కొని తెచ్చుకున్నట్టుగా వుందని అంటున్నారు. అవనిగడ్డ నియోజకవర్గం ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో వుంటూ, ఇక్కడి ప్రజల కన్నీరు తుడవటానికి కృషి చేసిన వారిని విస్మరించి పదవికోసం కొత్తగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన బుద్ధ ప్రసాద్‌కి టిక్కెట్ ఇవ్వడం సరైనపని కాదని స్థానిక తెలుగుదేశం కార్యకర్తలు విమర్శిస్తున్నారు. అలాగే నియోజకవర్గంలో తెలుగుదేశం అభివృద్ధికి కృషి చేసి, ఇప్పుడు టిక్కెట్ మీద ఆశలు పెట్టుకున్న తెలుగుదేశం నాయకులు చంద్రబాబు మీద తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నారు. స్థానిక తెలుగుదేశం నాయకులు ముత్తంశెట్టి కృష్ణారావు, అంబటి శ్రీహరి ప్రసాద్ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమను చంద్రబాబు దారుణంగా మోసం చేశారని అంటున్నారు. నియోజకవర్గంలో తెలుగుదేశం అభివృద్ధికి కృషి చేసిన ఏ తెలుగుదేశ నాయకుడికి టిక్కెట్ ఇచ్చినా తమకు అభ్యంతరం ఉండేది కాదని, సడెన్‌గా కాంగ్రెస్ నుంచి ఊడిపడిన మండలి బుద్ధ ప్రసాద్‌కి టిక్కెట్ ఇవ్వడాన్ని మాత్రం భరించలేకపోతున్నామని అంటున్నారు. ఈ ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిపోయే మండలి బుద్ధ ప్రసాద్‌కి తాము ఎంతమాత్రం సహకరించేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ గమనిస్తే ఈసారి అవనిగడ్డ స్థానంలో తెలుగుదేశం ఓటమి తప్పదని అనిపిస్తోంది.


.jpg)
.jpg)


