Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆటో డ్రైవర్ టు రూ. 900 కోట్ల ఎంపైర్: పెప్సీ, కోకాకోలానే వణికించిన సత్య శంకర్!
posted on: Jun 13, 2026 12:20PM
.webp)
జీవితంలో విజయం సాధించడానికి పెద్ద పెద్ద చదువులు, కోట్లలో పెట్టుబడులు అవసరం లేదని కర్ణాటకకు చెందిన సత్య శంకర్ నిరూపించారు. కేవలం 12వ తరగతి వరకే చదువుకుని, ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేయాల్సి వచ్చిన ఒక సాదాసీదా 18 ఏళ్ల కుర్రాడు ఈరోజు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బిజినెస్ టైకూన్‌గా మారారు. తండ్రి ఒక చిన్న గ్రామంలో పూజారిగా పనిచేసేవారు. కుటుంబ పేదరికం నుండి ఎలాగైనా బయటపడాలనే పట్టుదలతో సత్య శంకర్ ఒక ప్రభుత్వ పథకం ద్వారా లోన్ తీసుకుని ఆటోరిక్షా కొనడమే కాకుండా, డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకుని స్వయంగా ఆటో నడపడం ప్రారంభించారు.
ఆటో నడుపుతూ కష్టపడి లోన్ పూర్తిగా తీర్చేసిన తర్వాత, కొన్నాళ్లకు ఆ ఆటోను అమ్మేసి ఒక అంబాసిడర్ కారు కొని ట్యాక్సీ డ్రైవర్‌గా మారారు. ఆ ట్యాక్సీ డ్రైవింగ్ రోజుల్లోనే ఆయన జీవితాన్ని మలుపు తిప్పే ఒక అద్భుతమైన వ్యాపార ఆలోచన దొరికింది. ఆయన ట్యాక్సీలో ప్రయాణించే విదేశీ పర్యాటకులు ఎక్కడికి వెళ్లినా మొదట కొనేది ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్ మాత్రమేనని ఆయన గమనించారు. మార్కెట్‌లో స్వచ్ఛమైన తాగునీటికి ఎంతటి భారీ డిమాండ్ ఉందో అర్థం చేసుకున్న సత్య శంకర్ మైండ్‌లో వాటర్ బాటిల్ బిజినెస్ ఐడియా బలంగా నాటుకుంది.
1988లో కారు అమ్మేసి పుత్తూరులో ఒక చిన్న ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ షాప్ పెట్టారు. ఆ తర్వాత టైర్ల బిజినెస్, ఆపై 1994లో 'ప్రవీణ్ క్యాపిటల్' పేరుతో ఒక ఫైనాన్స్ కంపెనీని కూడా ప్రారంభించారు. పాత ఆటోలు, కార్లకు బ్యాంకులు ఎవరూ లోన్లు ఇవ్వని ఆ రోజుల్లో, తాను ఒకప్పుడు డ్రైవర్‌గా పడిన కష్టాలను గుర్తుచేసుకుంటూ తోటి డ్రైవర్లకు లోన్లు ఇవ్వడం ప్రారంభించి మంచి విజయం సాధించారు. అయితే మనసులో ఎక్కడో దాగున్న నీటి బిజినెస్ ఐడియాను ఆయన మర్చిపోలేదు. చివరికి 2000 సంవత్సరంలో పుత్తూరుకు దగ్గరలోని నరిమొగరు అనే గ్రామంలో ఒక ఫ్యాక్టరీ పెట్టి, కన్నడంలో చుక్క అని అర్థం వచ్చేలా 'బిందు' అనే బ్రాండ్‌తో వాటర్ బాటిళ్ల బిజినెస్ అధికారికంగా ప్రారంభించారు.
ఆ తర్వాత ఒకసారి ఉత్తర భారతదేశ పర్యటనలో ఉన్నప్పుడు, ఒక చిన్న దుకాణంలో సోడాలో జీలకర్ర పొడి, ఉప్పు కలిపి అమ్మడం సత్య శంకర్ చూశారు. దీన్ని మన స్టైల్‌లో మరింత బెటర్‌గా ఎందుకు ఇవ్వకూడదు అనుకుని పుత్తూరు తిరిగొచ్చిన వెంటనే 'బిందు ఫిజ్ జీరా మసాలా'ను తయారు చేశారు. మొదట్లో ఈ డ్రింక్‌ను మార్కెట్ అస్సలు పట్టించుకోలేదు. మార్కెట్‌కు 200 బాక్సులు పంపితే ఏకంగా 100 బాక్సులు వెనక్కి వచ్చేసేవి. మార్కెట్‌లో పెప్సీ, కోకాకోలా లాంటి అంతర్జాతీయ దిగ్గజాలు రాజ్యమేలుతున్న సమయమది. కానీ శంకర్ వెనకడుగు వేయకుండా, హైవేల పక్కన ఉన్న గోడలపై స్వయంగా పెయింటింగ్‌లు వేయిస్తూ వినూత్నంగా ప్రచారం చేశారు. మెల్లగా జనాలు ఆ లోకల్ టేస్ట్‌ను ఇష్టపడటం మొదలైంది. ముఖ్యంగా స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత 'బిందు జీరా సోడా' తాగడం ఒక పెద్ద ట్రెండ్‌గా మారిపోయింది.
ప్రస్తుత తాజా అంచనాల ప్రకారం సత్య శంకర్ నేతృత్వంలోని 'ఎస్‌జీ కార్పొరేట్స్' వార్షిక టర్నోవర్ ఏకంగా రూ. 900 కోట్లకు చేరింది. ఇందులో కేవలం 'హౌస్ ఆఫ్ బిందు' డ్రింక్స్ మరియు స్నాక్స్ విభాగం నుండే రూ. 570 కోట్లు వస్తుండగా, ఫైనాన్స్ బిజినెస్ నుండి రూ. 330 కోట్లు సమకూరుతోంది. ప్రస్తుతం జీరా మసాలా నుండి మ్యాంగో జ్యూస్ వరకు 55 రకాల విభిన్న ప్రొడక్ట్స్ వీరికి ఉన్నాయి. కర్ణాటక, తెలంగాణలలో సొంతంగా మేనుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలు ఉండగా, త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయబోతున్నారు. ఒకప్పుడు ఆటో నడిపిన బెల్లారే గ్రామానికి చెందిన ఈ కుర్రాడు.. నేడు అత్యంత విలాసవంతమైన లగ్జరీ రోల్స్ రాయిస్ కారును కొనే స్థాయికి ఎదిగారు. పెద్ద పెద్ద డిగ్రీలు లేకపోయినా, కేవలం కష్టపడే తత్వం, లోకల్ టేస్ట్‌ను నమ్ముకుంటే అద్భుతాలు సృష్టించవచ్చని సత్య శంకర్ నిరూపించారు.



.webp)


