పాకిస్థాన్‌లో మైనారిటీ బాలికలపై అకృత్యాలు: ఐరాస సంచలన నివేదిక

posted on: May 1, 2026 2:42PM

పాకిస్థాన్‌లో మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలు, ముఖ్యంగా హిందూ, క్రైస్తవ బాలికల పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతోంది. వారిపై జరుగుతున్న అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. అపహరణలు, బలవంతపు మత మార్పిడులు, బాల్య  వివాహాలు, లైంగికదాడుల అంశంపై ఐక్యరాజ్యసమితి   తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 

2025 సంవత్సరానికి సంబంధించి అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం, ఇటువంటి వేధింపులకు గురవుతున్న వారిలో అత్యధికులు హిందూ సామాజిక వర్గానికి చెందిన వారేనని  ఐరాస నివేదికలు స్సష్టం చేస్తోంది.  మానవ హక్కుల ఉల్లంఘనలు పాక్ లో ఏ స్థాయిలో ఉన్నాయో ఈ నివేదికలు కళ్లకు కడుతున్నాయి.  గణాంకాలు చెబుతున్న భయానక వాస్తవాలు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం  వెల్లడించిన వివరాల ప్రకారం..  బలవంతపు మత మార్పిడి,  వివాహాల కేసుల్లో సుమారు 75 శాతం మంది బాధితులు హిందూ మతానికి చెందిన బాలికలు కాగా,  మిగిలిన పాతిక శాతం మంది క్రైస్తవ బాలికలు. ఈ దారుణాలు ప్రధానంగా సింధ్ ప్రావిన్స్‌లో కేంద్రీకృతమై ఉన్నాయి. అక్కడ సుమారు 80 శాతం కేసులు నమోదవుతున్నాయి. అపహరణకు గురవుతున్న వారిలో ఎక్కువ మంది 14 నుండి 18 ఏళ్ల లోపు వారే ఉండటం గమనార్హం.

 పేదరికం,  సామాజిక అభద్రత కారణంగా వీరు అరాచక శక్తులకు సులభ లక్ష్యాలుగా మారుతున్నారు.  ఈ దారుణాలు కేవలం యాదృచ్ఛికంగా జరుగుతున్నవి కావు, వ్యవస్థీకృత నేరమని మానవ హక్కుల సంస్థలు విశ్లేషిస్తున్నాయి. తొలుత గ్రామీణ ప్రాంతాల్లోని బాలికలను అపహరించడం, ఆపై ప్రాణభయం ఏర్పడేలా చేసి వారిని బలవంతంగా మతం మార్చడం వంటి చర్యలు నిత్యకృత్యమయ్యాయి. ఆపై అపహరించిన వ్యక్తులతోనే వారికి వివాహాలు జరిగినట్లు నకిలీ పత్రాలు సృష్టించి.. మత పెద్దల ద్వారా వాటికి ఆమోద ముద్ర వేయిస్తున్నారు. ఈ క్రమంలో బాలికలు లైంగిక దోపిడీకి గురవుతున్నారు.  అంతే కాకుండా వారిని బలవంతంగా వైశ్యావృత్తిలోకి కూడా దింపుతున్నారు. వ్యవస్థల వైఫల్యం మరియు శిక్షలేమి పాకిస్థాన్‌లోని పోలీసు మరియు న్యాయ వ్యవస్థలు మైనారిటీల పట్ల అనుసరిస్తున్న ఉదాసీన వైఖరి ఈ నేరస్తులకు వరంగా మారుతోంది. బాధితుల కుటుంబాలు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడం.  విచారణలో జాప్యం చేయడం వంటివి నిందితులకు బలాన్నిస్తున్నాయి. బాలికల వయస్సును నిర్ధారించే అధికారిక పత్రాలను పక్కనబెట్టి..  నేరస్థులు సమర్పించే నకిలీ మత పత్రాలనే కోర్టులు సైతం పరిగణనలోకి తీసుకోవడం శోచనీయం.  మరియా షహ్‌బాజ్ వంటి ఎన్నో కేసులు ఇక్కడి న్యాయ వ్యవస్థలోని లోపాలకు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.  

ఈ అమానవీయ చర్యలను అరికట్టాలని ఐక్యరాజ్యసమితి పాకిస్థాన్ ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తోంది. బలవంతపు మత మార్పిడిని తీవ్రమైన నేరంగా పరిగణించి చట్టాలు చేయాలని..  వివాహ వయస్సును దేశవ్యాప్తంగా 18 ఏళ్లకు పెంచాలని సూచించింది. బాధితులకు తక్షణమే రక్షణ కల్పించేందుకు ప్రత్యేక ఆశ్రయాలు, న్యాయ సహాయం,  మానసిక వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రతి కేసులోనూ నిష్పాక్షిక దర్యాప్తు జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి.  

ఈ అరాచకాల వల్ల మైనారిటీ సమాజం మొత్తం భయాందోళనల్లో బతుకుతోంది. అపహరణకు గురై తిరిగి వచ్చిన బాలికలు తీవ్రమైన మానసిక సంక్షఓభానికి (mental trauma) లోనౌతున్నారు. సమాజం నుండి వేలివేత, విద్యకు దూరం కావడం మరియు నిరంతర హింస వారి జీవితాలను అంధకారం చేస్తున్నాయి. ఇది కేవలం వ్యక్తిగత హక్కుల ఉల్లంఘన మాత్రమే కాదు.  ఒక సామాజిక వర్గం  ఆత్మగౌరవం,  మనుగడపై జరుగుతున్న దాడిగా మానవ హక్కుల కార్యకర్తలు అభివర్ణిస్తున్నారు.

పాకిస్థాన్‌లో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు ఆ దేశ ప్రజాస్వామ్య విలువలపై ప్రశ్నలు సంధిస్తున్నాయి. మత స్వేచ్ఛ మరియు మైనారిటీల భద్రతను కాపాడటంలో విఫలమైతే, అది అంతర్జాతీయ స్థాయిలో ఆ దేశ ప్రతిష్టను మరింత దిగజార్చుతుంది. బాలికల రక్షణ కోసం తక్షణమే కఠిన చర్యలు చేపట్టకపోతే, ఈ నిశ్శబ్ద విపత్తు మరింత మంది జీవితాలను బలితీసుకునే ప్రమాదం ఉంది.  

- సీతారాం కంఠంనేని

References

1.    OHCHR – UN experts concerned by forced conversion through marriage in Pakistan OHCHR
2.    UNPO – UN Experts Sound Alarm Over Widespread Forced Conversions of Minority Women and Girls in Pakistan UNPO
3.    News18 – 75% Victims Hindu, Girls 14-18 Targeted: Forced Conversion Cases in Pakistan News18
4.    Firstpost – Pakistan’s ‘child brides’: How forced conversion targets mostly teenage, Hindu girls Firstpost
5.    Human Rights Focus Pakistan – Statements on Maria Shahbaz case Pakistan Christian Post Malaysia Sun
6.    UN experts, media reports on minority girls’ abductions and exploitation in Sindh, Punjab UNPO Devdiscourse thevopm.org

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా పోర్టల్ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...