నోట్ల రద్దు లేదు..అయినా "నో" క్యాష్

posted on: Mar 8, 2017 4:23PM

బ్యాంకుల ముందు చాంతాడంత క్యూలు...ఏటీఎంల ముందు నో క్యాష్ బోర్డులు..పనులు పక్కనపెట్టి డబ్బు కోసం తంటాలు. ఇవన్నీ పెద్దనోట్ల రద్దు జరిగినప్పుడు దేశప్రజల కళ్లకు కనిపించిన దృశ్యాలు. ఆర్‌బీఐ వేగంగా స్పందించడంతో నోట్ల కష్టాలు కొంచెం కొంచెం తగ్గుతూ వచ్చాయి. ఇక ఫిబ్రవరి తర్వాత ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తామని ప్రభుత్వం కూడా ప్రకటించింది. కాని గత కొద్ది రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఏటీఎంలు పనిచేయడం లేదు..దీంతో జనం బ్యాంకుల ముందు బారులు తీరుతున్నారు..డిపాజిట్లు పడిపోయి, విత్‌డ్రాలు పెరిగిపోయాయి.

 

 

నెల మొదలు కావడంతో సాధారణంగా నగదు ఉపసంహరణకు డిమాండ్ అధికంగా ఉంటుంది. కానీ బ్యాంకర్లు ఏటీఎం మిషన్లలో నగదును అందుబాటులో ఉంచకపోవడంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు కారణాలు అనేకం..పెద్ద నోట్ల రద్దు సమయంలో ఖాతాదారులంతా పెద్ద ఎత్తున మొత్తాలను బ్యాంకుల్లో వేశారు. ఇప్పుడు ఆ నగదుని పెద్ద మొత్తంలో విత్‌డ్రా చేస్తున్నారు. నవంబర్, డిసెంబర్ నెలలో జరిగిన డిపాజిట్లలో 60 శాతం వివిధ రూపాల్లో బయటకు వెళ్లిపోయాయి.

 

 

అలాగే బ్యాంకు నుంచి బయటకు వెళ్లిపోయిన 2000 నోటు తిరిగి రావడం లేదు. ఇంతకీ, మార్కెట్‌లోకి వస్తున్న 2 వేల రూపాయల నోటు ఏమవుతోంది. బ్లాక్ మనీగా మారి, పెద్దల గోదాముల్లో మగ్గుతున్నాయనుకోవాలా..ఏదీ ఏమైనా దేశంలో మళ్లీ కరెన్సీ సంక్షోభం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ కష్టాలు తీరాలంటే కొత్త నోట్లు పూర్తి స్థాయిలో బ్యాంకుల్లో అందుబాటులోకి రావాలి. నగదు ఉపసంహరణలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అదే స్థాయిలో డిపాజిట్లు వచ్చేలా చూడాలి. ఏటీఎంలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలి..అప్పటిదాకా జనానికి తిప్పలు తప్పవు.

google-ad-img
    Related Sigment News
    • Loading...