హమ్మయ్య వర్షాలు పడుతున్నాయి.!

posted on: Jul 17, 2026 9:10AM

వానాకాలంలో కూడా మండు వేసవిని తలపిస్తున్న వాతావరణం నుంచి తెలంగాణకు ఎట్టకేలకు ఉపశమనం లభించింది.  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో  తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. పలు జిల్లాలలో వర్షాలు కురుస్తున్నాయి.  ఈ నెల 22వ తేదీ వరకు రాష్ట్రం వ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. 

బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్ తీర ప్రాంతంలో  ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా  కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో   తెలంగాణలో  ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాలలో  ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. శుక్రవారం (జులై 17)   తెల్లవారుజామున హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఇక శనివారం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో బలమైన ఉపరితల గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.  

ఇలా ఉండగా గురువారం (జులై 16) రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో 4.3 సెంటీమీటర్లు, నల్గొండ జిల్లా చండూరులో 3.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, ములుగు, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల్లోని పలు ప్రాంతాలలో  ఓ మోస్తరు వానలు పడ్డాయి.  

 ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో  ఖరీఫ్ సాగు పనులు మందగించిన తరుణంలో  అల్పపీడనం కారణంగా కురుస్తున్న ఈ వర్షాలు వ్యవసాయ పనులకు ఊతమిస్తాయని, పంటలకు జీవం పోస్తాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Telangana Weather,  Low Pressure Bay of Bengal, Hyderabad Rains, IMD Hyderabad Forecast, Telangana Monsoon Rains 

google-ad-img
    Related Sigment News
    • Loading...