Latest News
బెట్టింగ్ యాప్ కుంభకోణం..బుర్జ్ ఖలీఫా విల్లా సహా రూ. 1700 కోట్ల ఆస్తులు అటాచ్!
posted on: Mar 26, 2026 12:43PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కుంభకోణంలో ఈడీ కీలక అడుగు వేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా దుబాయ్‌లోని ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫాలోని ఓ విలాసవంతమైన విల్లా సహా మొత్తం 1700 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సౌరభ్ చంద్రఖర్, రవి ఉప్పల్‌లు ఈ మహదేవ్ యాప్‌కు ప్రధాన సూత్రధారులుగా వ్యవహరిస్తున్నారు. వీరు విదేశాల్లో ఉంటూ భారత్‌లో పెద్ద ఎత్తున బెట్టింగ్ నెట్‌వర్క్‌ను నడిపించినట్లు గుర్తించిన ఈడీ.. వీరిపై మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో, వీరికి చెందిన వివిధ కంపెనీలు, బినామీ ఆస్తులపై నిఘా ఉంచింది. తాజాగా ఇండియా, దుబాయ్‌లో ఉన్న ఆస్తులను అటాచ్ చేసింది.
రాయ్‌పుర్‌లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయం ప్రకారం, అటాచ్ చేసిన ఆస్తుల్లో బుర్జ్ ఖలీఫాలోని ఖరీదైన నివాసాలతో పాటు పలు ఇతర విల్లాలు కూడా ఉన్నాయి. నిందితులు అక్రమ మార్గాల్లో సంపాదించిన సొమ్మును రియల్ ఎస్టేట్ రంగంలోకి మళ్లించినట్లు ఈడీ ఆధారాలు సేకరించింది. ఈ నేపథ్యంలోనే విదేశాల్లోని ఆస్తులను కూడా స్వాధీనం చేసుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.
ప్రస్తుతం నిందితులు రవి ఉప్పల్, సౌరభ్ చంద్రఖర్ విదేశాల్లో తలదాచుకున్నట్లు సమాచారం. వీరిని భారత్‌కు రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఇంటర్‌పోల్ సహాయంతో ప్రయత్నాచేపట్టింది. చంద్రఖర్ చివరగా యూఏఈలో ఉన్నట్లు గుర్తించగా, రవి ఉప్పల్ వనౌటు దేశానికి పారిపోయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, తాము కేవలం సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్‌ను అందించామని, ఈ అక్రమాలతో తమకు సంబంధం లేదని నిందితులు చెబుతున్నారు.
ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్‌కు ఈ యాప్ ప్రమోటర్లు 508 కోట్ల రూపాయలు ముట్టచెప్పినట్లు గతంలో ఈడీ పేర్కొనడంతో ఈ కేసు రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో రాజకీయ నాయకుల ప్రమేయంపై కూడా లోతైన విచారణ సాగుతోంది. రానున్న రోజుల్లో బెట్టింగ్ నెట్‌వర్క్‌కు సంబంధించి మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. . విదేశీ ప్రభుత్వాల సహకారంతో నిందితుల బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేయడమే కాకుండా, వారిని కస్టడీలోకి తీసుకునే దిశగా ఈడీ వ్యూహాత్మకంగా ముందుకు కుదులుతోంది.






