ఎమ్మెల్యే అయిన బౌలింగ్ చేస్తాను- శ్రీశాంత్‌

posted on: Mar 29, 2016 12:41PM

 

ఫిక్సింగ్ ఆరోపణలతో క్రికెట్‌కు దూరమైన శ్రీశాంత్ ఇప్పుడు కేరళ రాజకీయాలతో చురుకుగా ఆడుకుంటున్నాడు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తిరువనంతపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా నిలబడనున్న శ్రీశాంత్‌, ఆటకు ముందుగానే మాటల యుద్ధాన్ని మొదలుపెట్టాడు. క్రికెట్‌లో తను ఎలాగైతే దూకుడుగా వ్యవహరిస్తానో, రాజకీయాలలో కూడా అంతే దూకుడుగా ఉంటానంటున్నాడు శ్రీశాంత్‌. యువత రాజకీయాలలో రావల్సిన అవసరం ఎంతైనా ఉందనీ, అందుకే తాను ఈ రంగంలోకి అడుగుపెట్టానని పేర్కొంటున్నాడు. ప్రధానమంత్రి మోదీకి తను వీరాభిమానిని కనుక, బీజేపీలో చేరానని చెప్పుకొస్తున్నాడు. అయితే ప్రతిపక్షాల ఆరోపణలు మాత్రం వేరేలా ఉన్నాయి. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో అధికారిక క్రికెట్ నుంచి దూరమైన శ్రీశాంత్‌, ఆ ఆరోపణల నుంచి బయటపడేందుకే అధికార పార్టీలో చేరాడని విమర్శిస్తున్నాయి.

 

2005లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన శ్రీశాంత్‌, ఆది నుంచి ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉన్నాడు. తాజాగా 2013లో జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణల తరువాత, శ్రీశాంత్‌ను బీసీసీఐ నిషేధించింది. అయినా శ్రీశాంత్ నిశ్శబ్దంగా ఉండిపోలేదు. ఇప్పటికే కొన్ని సినిమాలలో నటించేందుకు సిద్ధపడ్డాడు. ఇప్పుడేమో రాజకీయాలలోనూ అడుగుపెట్టాడు. మరి ఒకవేళ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక కూడా క్రికెట్ ఆడతారా అనే ప్రశ్నకు ‘ఔను’ అంటూ తడుముకోకుండా జవాబు ఇస్తున్నాడు. ఇప్పటికీ తాను వేగంగా బంతులు విసరగలననీ, దేశం తరఫున ఆడగలననీ అంటున్నాడు. శ్రీశాంత్‌ సిద్ధంగా ఉన్నా బీసీసీఐ ఒప్పుకోవాలి కదా!

google-ad-img
    Related Sigment News
    • Loading...